ఫోర్డ్ మస్టాంగ్ జూలైలో మార్కెట్లోకి..
♦ 2017కల్లా 30 అస్సెట్ సెంటర్లు
♦ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్డ్ తయారీ మస్టాంగ్ కారు త్వరలో భారత్‌లో పరుగు తీయనుంది. 1964లో మొదలైన మస్టాంగ్ ప్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5 లీటర్ వి8 ఇంజన్‌తో 4 సీట్లతో రూపొందిన ఈ కారు ఆరు రంగుల్లో లభిస్తుంది. ధర రూ.60-80 లక్షలు ఉండొచ్చు. భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరవ తరం మస్టాంగ్ కారు జూలైలో రోడ్డెక్కనుంది. తొలిసారిగా రైట్ హ్యాండెడ్ మోడల్‌ను కంపెనీ ప్రవేశపెడుతుండడం విశేషం.
మూడు నెలల్లో ఇక్కడి రోడ్లపైకి మస్టాంగ్ దూసుకెళ్లే అవకాశం ఉందని ఫోర్డ్ ఇండియా కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.ప్రభు తెలిపారు. శుక్రవారమిక్కడ ముషీరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో ఆటోమోటివ్ స్టూడెంట్ సర్వీస్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (అస్సెట్) కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
సుశిక్షితులైన సిబ్బంది: అసెట్ కేంద్రాల్లో ఐటీఐ విద్యార్థులకు మోటార్ మెకానిక్ వెహికిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కోర్సు పూర్తి అయితే ఫోర్డ్ సర్వీసింగ్ కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు ఉపాధి కూడా కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ముషీరాబాద్ ఐటీఐలో అస్సెట్ కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో కంపెనీకి దేశంలో ఇలాంటి సెంటర్ల సంఖ్య 8కి చేరుకుంది.
డిసెంబర్‌కి మరో 7 కేంద్రాలు రానున్నాయి. 2017లో 15 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభు తెలిపారు. ‘ఒక్కో అసెట్ సెంటర్‌కు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి రెండు వారాలకు ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నాం. పెద్ద నగరాల్లో అయితే వర్క్‌షాప్‌కు కనీసం 25-30 మంది మెకానిక్‌లు అవసరం. 2016లో 600 మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు.