ఆ ఆటో దిగ్గజంలోనూ ఉద్యోగాలు కట్
ఆ ఆటో దిగ్గజంలోనూ ఉద్యోగాలు కట్
Published Tue, May 16 2017 11:50 AM | Last Updated on Thu, Oct 4 2018 4:56 PM
మిచిగాన్ : టెక్ దిగ్గజంలోని ఉద్యోగాల కోత ఇప్పుడు ఆటో కంపెనీలకు పాకినట్టుంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ కూడా తమ స్టాఫ్ కు కోత పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని వాల్ స్ట్రీట్ తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంట లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది.
అలాన్ ములల్లిని రీప్లేస్ చేస్తూ ఫోర్డ్ సీఈవోగా మార్క్ ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36 శాతం పడిపోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డు సభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. ఈ ప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఫోర్డ్ కంపెనీలో 201000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,01,000 మంది నార్త్ అమెరికాలోనే ఉన్నారు.
Advertisement