ఉబర్ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ ఏకపక్షంగా కీలక నిర్ణయం తీసుకుని బోర్డు సభ్యులను ఆశ్చర్యపరిచారు. ఈ పాపులర్ రైడ్ సర్వీసులో ఇప్పటికే నాయకత్వంలో ఉన్న టెన్షన్‌ను మరింత పెంచుతూ.. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలోకి మరో ఇద్దరు కొత్త సభ్యులను చేర్చుకున్నారు. శుక్రవారం రోజు జిరాక్స్ మాజీ చైర్మన్, సీఈవో ఉర్సుల బర్న్స్ ను, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ జాన్ థైన్‌లను బోర్డులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నియామకంపై వచ్చే వారంలో బోర్డు ఓటింగ్ జరుగనుంది. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జూన్‌లో కలానిక్ ఉబర్ సీఈవోగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వచ్చే వారంలో కొత్త సభ్యుల నియామకంపై జరుగబోయే ఓటింగ్‌లో కలానిక్‌కు తక్కువ ఓటింగ్ అధికారాలున్నట్టు అమెరికా మీడియా రిపోర్టు చేసింది. అపారమైన బోర్డు అనుభవం కలిగిన ఉర్సుల, జాన్ థైన్‌లు ఇద్దరూ అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లీడర్లని కలానిక్ చెప్పారు. బోర్డును పునర్వ్యస్థీకరించాలనే తాజా బోర్డు ప్రతిపాదన మేరకే వీరి నియామకం జరిగినట్టు చెప్పారు. వీరి నియామకంపై కలానిక్ బోర్డును సంప్రదించకపోవడం బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ఆశ్చర్యపరించింది. ఉర్సుల, జాన్ థైన్ నియామాకం ఇటు ఉబర్‌కు, అటు బోర్డుకు పూర్తిగా ఆశ్చర్యపరిచే విషయమని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో మరో కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. బోర్డులో కలానిక్‌కు మద్దతిచ్చేవారు, వ్యతిరేకించేవారు రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది.