ఉచిత సేవలు అసాధ్యం | Free services impossible says HDFC CEO adityapuri | Sakshi
Sakshi News home page

ఉచిత సేవలు అసాధ్యం

Published Thu, Mar 9 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

ఉచిత సేవలు అసాధ్యం

ఉచిత సేవలు అసాధ్యం

మెరుగైన సేవలకు రుసుములు చెల్లించాల్సిందే
లేదంటే ఎవరో ఒకరు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది
ప్రపంచంలో మన దగ్గరే చార్జీలు తక్కువ...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో ఆదిత్యపురి


ముంబై: ‘‘స్టార్‌ హోటల్‌కు వెళ్లి ఇంటి ధరలకే లంచ్‌ అడిగితే ఎలా...? బ్యాంకులు ఉన్నది వడ్డీ వ్యయాలు వసూలు చేసుకునేందుకు కాదు. అత్యుత్తమ సేవలు, ఉత్పత్తులు కావాలనుకుంటే అందుకు తగ్గ చార్జీలు వసూలు చేయడం పూర్తిగా సహేతుకం. చార్జీలు విధించకూడని వర్గం కూడా ఉంది. దాన్ని మేము అర్థం చేసుకోగలం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో ఆదిత్యపురి చెప్పారు. ఇటీవల ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీలు, బ్యాంకు శాఖల్లో నగదు జమలపై చార్జీలను ఖరారు చేయడంతోపాటు ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నగదు నిల్వలు పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిక్‌ తదితర బ్యాంకులు సైతం బ్యాంకు శాఖల్లో నగదు జమలను నెలలో నాలుగుకు మాత్రమే పరిమితం చేశాయి. ఆపై ప్రతీ లావాదేవీకి సుమారుగా రూ.150 వరకు చార్జీలను వసూలు చేయనున్నట్టు ప్రకటించాయి. బ్యాంకుల నిర్ణయాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నిర్ణయాలను మరోసారి సమీక్షిం చాలని కేంద్రం బ్యాంకులను కోరింది. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవలకు చార్జీల విధింపు ఎంత వరకు సబబు అన్న అంశంపై ఆదిత్యపురి ఓ వార్తా సంస్థకు వివరాలు అందించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ప్రపంచంలో ఇక్కడే తక్కువ..!
దేశంలో బ్యాంకింగ్‌ సేవల చార్జీలు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడే తక్కువ. అయినా, ప్రజలు బ్యాంకులను తప్పుబడుతున్నారు. దాదాపు చాలా వరకు చెల్లింపులు, నగదు బదిలీలకు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదన్న విషయాన్ని గమనించాలి.

నగదు జమలపై ఎందుకు?
అధిక మొత్తంలో నగదు డిపాజిట్‌ చేస్తే అందుకు మాకు వ్యయం అవుతుంది. టెల్లర్‌ ఆ మొత్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది. తిరిగొచ్చి ఆ మొత్తాన్ని డ్రా చేసుకుని వెళతారు. అందుకు కూడా మాకు ఖర్చవుతుంది. ఆ ఖర్చులను చెల్లించాలి. మాదేమీ ఉచిత సంస్థ కాదు. మా వాటాదారులకు లాభాలను పంచాల్సి ఉంటుంది.

డిపాజిట్లపై బ్యాంకులకు ఆదాయం వస్తోందిగా...?
ఈ సందర్భంగా ఓ విషయం స్పష్టం చేయాల్సిందే. ఉదాహరణకు రూ.10,000 రూపాయల సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్‌ ఉందనుకోండి. దానిపై 4 శాతం వడ్డీని ఖాతాదారుడికి చెల్లించాలి. 4 శాతాన్ని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) కింద పక్కన పెట్టాలి. ఓ ఏడాదికి మాకొచ్చే ఆదాయం రూ.200. దీనికే, ఖాతాదారులు ఉచితంగా ఏటీఎం ఇవ్వాలని ఆశిస్తారు. చెక్కు బుక్‌ చార్జీలు ఉండకూడదంటారు. నగదు నిర్వహణ చార్జీలు వద్దంటారు. ఖాతాలో నెలవారీ కనీస నగదు నిల్వ రూ.5,000 ఉంచడం తప్పనిసరి అంటూ ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ఏం చెప్పారో గుర్తు చేసుకోండి.  

కార్డు లావాదేవీలపై ఎండీఆర్‌ సహేతుకమేనా?
దుకాణాల్లో కార్డులను స్వైప్‌ చేసినప్పుడు వర్తకుల నుంచి వసూలు చేసే చార్జీల (ఎండీఆర్‌) విషయమై ఆదిత్య పురి మాట్లాడుతూ... అయిన ఖర్చునే ఎండీఆర్‌ రూపంలో వసూలు చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఉచితం చేయాలనుకుంటే సంతోషం. అయితే, అప్పుడు ప్రభుత్వమే టెర్మినళ్లు పెట్టాలి. మేము టెర్మినళ్లను (స్వైపింగ్‌ మెషీన్లు) పెడితే వారు ఉచితంగా వినియోగించుకోవడం సహేతుకం కాదు. మీరు చెబుతున్న దాని ప్రకారం పాంటలూన్స్, తాజ్‌ హోటళ్లు వంటి చోట కూడా సబ్సిడీని మేము భరించాల్సి ఉంటుంది. ఆయా సంస్థల లాభాలు పెరుగుతుంటే మేము ఉచితంగా ఎందుకు అందించాలి? చిన్న కిరాణా షాపు విషయంలో సబ్సిడీ అందించేందుకు ఓ మార్గాన్ని కనుగొనాలి. యూపీఐని ఇందుకు వినియోగించుకోవచ్చు. లేదంటే ఎండీఆర్‌ను తక్కువగా నిర్ణయించవచ్చు. అంతేకానీ ఎవరో ఒకరు సబ్సిడీ భరించకుండా ఉచితంగా కార్డు లావాదేవీలను అందించడం సాధ్యం కాదు.

అవినీతికి డిజిటలే మంత్రం!
అవినీతి నియంత్రణ, పారదర్శకతకు డిజిటల్‌ తప్ప మరో మార్గం లేదు. డిజి టల్‌కు ఊతమిచ్చే డీమోనిటైజేషన్‌ను మూడేళ్ల క్రితమే తీసుకొచ్చి ఉండాల్సింది. డీమోనిటైజేషన్‌ వల్ల వడ్డీ రేట్లు దిగొచ్చాయి. వ్యవస్థలోకి వచ్చిన నగదు అంతా నల్లధనం కాదు. దీనివల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. అది ఒక శాతం కావచ్చు లేదా రెండు శాతం కావచ్చు. కానీ కచ్చితంగా పన్ను ఆదాయం పెరుగుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement