
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, జెన్సర్, హెక్సావేర్ తదితర సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో సంస్థ సుమారు వెయ్యి మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నాయి. మైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరంలో 1,285 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. ఈ సారి సంఖ్య అంతకు మించి ఉండగలదని మైండ్‌ట్రీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు.. గతేడాది 1,000 మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకున్న జెన్సర్.. ఈ ఏడాది అదే స్థాయిలో లేదా అంతకు మించి రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. తామూ క్యాంపస్ నియామకాలను పెంచుకుంటున్నట్లు, ఇప్పటికే 500 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు హెక్సావేర్ వర్గాలు తెలిపాయి. పెద్ద కంపెనీలు మాత్రం అంతగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ వైపు చూడటం లేదు.
అవసరానికి తగ్గట్లుగా వివిధ విభాగాల్లో అల్లుకుపోగలిగే చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలే ఫ్రెషర్స్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీంతో గతంలో అంత కాకపోయినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఉంటున్నాయని మైండ్‌ట్రీ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ ఖన్నా తెలిపారు. 2014–15 స్థాయితో పోలిస్తే 60–70% హైరింగ్ ఉంటోందని చెప్పారు.
డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి ...
మధ్య స్థాయి ఐటీ కంపెనీల ఆదాయాల్లో సగటున 40 శాతం వాటా డిజిటల్ వ్యాపారం నుంచే ఉంటోంది. దీంతో అవిæప్రధానంగా డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర డిజిటల్ కోర్సుల్లో సర్టిఫికేషన్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇది గుర్తించిన కాలే జీలు.. డిజిటల్ నైపుణ్యాలపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి.
ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం మధ్య స్థాయి ఐటీ సంస్థల్లో 33–35 శాతం సిబ్బంది డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన వారు ఉంటున్నారు. అదే చిన్న స్థాయి కంపెనీల్లోనైతే ఇది 38 శాతంగా ఉంటోంది. మరోవైపు, ఐటీ కంపెనీలు సిబ్బంది వినియోగ స్థాయిని కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి. దీంతో బెంచ్ సిబ్బంది సంఖ్య 18 శాతానికి తగ్గింది. వనరుల వినియోగం అయిదు శాతం మేర పెరిగింది. దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ విలువ 167 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 7–9 % వృద్ధి చెందగలదని అంచనా. ఇది 10–12% ఉంటుందని 2016–17లో నాస్కామ్ అంచనా వేసినప్పటికీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని సవరించక తప్పలేదు. ఐటీ రంగంలో సుమారు 4,00,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. కొన్నాళ్లుగా ఉద్యోగాల కల్పన వృద్ధి మాత్రం మందగించింది. గతేడాది ఐటీ లో నికరంగా లక్ష మంది సిబ్బంది తోడైనట్లు అంచనా.