ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. సుమారు 40 వేల మంది పైచిలుకు ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కంపెనీ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపరమైన ఆంక్షల కారణంగా హైరింగ్‌లో ఎలాంటి సమస్యలూ ఉండవని, గతేడాది 3.60 లక్షల మంది ఫ్రెషర్లు వర్చువల్‌గా ఎంట్రన్స్ టెస్టులో పాల్గొన్నారని ఆయన వివరించారు. ‘దేశీయంగా క్యాంపస్‌ల నుంచి గతేడాది 40,000 మందిని రిక్రూట్ చేసుకున్నాం. ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకు మించి నియామకాలు చేపడతాం‘ అని మిలింద్ వివరించారు.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌తో పాటు ఇతరత్రా నియామకాలు కూడా భారీగానే ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అనేది అప్పటికప్పుడు చేపట్టేది కాదని, దీని వెనుక చాన్నాళ్ల ప్రణాళిక ఉంటుందన్నారు. ప్రస్తుతం అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యంత కనిష్టంగా 8 శాతంగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇది మళ్లీ సాధారణ స్థాయి అయిన 11–12 శాతానికి పెరిగే అవకాశం ఉందని మిలింద్ చెప్పారు. అయితే, అట్రిషన్ పెరిగినా కూడా విధులు, మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడని విధంగా సంస్థ నిర్వహణ విధానం ఉంటుందన్నారు. టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment