వాణిజ్య విమానాలు భారత్‌లోనే తయారవ్వాలి
స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ ఆకాంక్ష
వాషింగ్టన్: విమానయాన రంగంలో భారత్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తున్న క్రమంలో దేశీయంగా వాణిజ్య విమానాల తయారీని ప్రోత్సహించే విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని స్పైస్‌జెట్ సీఈవో అజయ్‌సింగ్ సూచించారు. 100 విమానాల కొనుగోలు కోసం అమెరికా సంస్థ బోయింగ్‌కు స్పైస్‌జెట్ ఇటీవల ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అజయ్‌సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అభినందనలు కూడా అందుకున్నారు. ఈ ఆర్డర్ అమెరికాలో వేలాది ఉద్యోగాలకు తోడ్పాటునిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వెంట ట్రంప్‌ను కలిసిన బృందంలో అజయ్‌సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అజయ్‌సింగ్ వాషింగ్టన్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఫోన్ల తయారీపై యాపిల్ వంటి కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నప్పుడు... విమానాల తయారీదారులతో ఆ పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ దిశగా వెంటనే ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించాలని, భారత్‌లో తయారీపై వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత విమానయాన సంస్థలు 600కుపైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద వాణిజ్య విమానయాన మార్కెట్‌గా అవతరించనుందన్నారు. 120 మిలటరీ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తున్నప్పుడు, వాణిజ్య విమానాలపైనా అదే విధంగా దృష్టి పెట్టాలని ఆశించారు. ‘‘దేశీయంగా విమానయాన మార్కెట్ 20–25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. దేశ జనాభాలో 3 శాతం మందే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. కనుక ఈ రంగలో అపార అవకాశాలు ఉన్నాయి’’ అని అజయ్ సింగ్ పేర్కొన్నారు.