స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచిస్టార్ హోటల్స్ వరకు..! | from stock exchange to star hotels | Sakshi
Sakshi News home page

స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచిస్టార్ హోటల్స్ వరకు..!

Published Sat, May 3 2014 1:16 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచిస్టార్ హోటల్స్ వరకు..! - Sakshi

స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచిస్టార్ హోటల్స్ వరకు..!

సాక్షి, హైదరాబాద్:  బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, బీఏఆర్సీ, ఎన్పీసీఎల్, ఐఆర్‌ఈఎల్ వంటి పరిశోధనా సంస్థలు, బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిందేదంటే ‘‘ముంబై’’ అని ఠక్కున చెప్పేస్తాం. కానీ, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే దేశంలో మరో ముంబై నగరం తయారుకాబోతోంది. అది మన హైదరాబాద్‌లోనే. ఇంకా చెప్పాలంటే ముంబై  కంటే రెట్టింపు అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్టాక్ ఎక్స్ఛేంజ్, రిలయన్స్ బిజినెస్ సెంటర్ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో దేశ, విదేశీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి, అక్కడి వ్యాపార అవకాశాలపై యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెరైక్టర్ కళిశెట్టి నాయుడు ‘సాక్షి రియల్టీ’కి వివరించారు.

 హైదరాబాద్ మెట్రో రైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్), ఔటర్ రింగ్‌రోడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఇప్పటికే హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధితో మరింత తలమానికంగా నిలవనుంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలైందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. ముందుగా బంజారాహిల్స్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆపైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు పరుగులు పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ బూమ్ తెల్లాపూర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. దీన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో  ‘డెవలప్‌మెంట్ మేకింగ్ షిఫ్ట్’గా చెబుతారు.

 స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి స్టార్ హోటల్స్ వరకు..
 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో దేశ, విదేశీ సంస్థలకు చెందిన బడా సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. వీటిలో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి స్టార్ హోటళ్ల వరకు అన్నీ ఉన్నాయి.

 హైదరాబాద్, ముంబై రెండు నగరాల్లో జరిగే స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించేందుకు వీలుగా ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో డాటా రీకవరి యూనిట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) భూమిని కూడా కేటాయించింది.

 సుమారు 80 ఎకరాల్లో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలో వంద అంతస్తుల బిజినెస్ టవర్ రానుంది. దీన్ని 2007లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతిపాదించింది. అయితే కొంత ఆర్థిక లోటుపాట్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలం ఆగిపోయింది. కానీ, ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణం, వ్యయాల్లో చిన్న మార్పులతో ప్రాజెక్ట్ నిర్మాణ దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి పంపించారు.

 అంతేకాకుండా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) శాశ్వత ఆఫీసు చిరునామా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానుంది. వీటితో పాటు ఇజ్రాయిల్‌కు చెందిన ఓ సంస్థ హిల్‌టౌన్ హోటల్, అమెరికాకు చెందిన యూఎస్ కాన్సులేట్, మారియట్ , హయత్ హోటళ్లు, ఆధునిక చికిత్స విధానాలతో కాంటినెంటల్ ఆసుపత్రి కూడా ఇక్కడ రానుంది. మూడు హోటళ్లు కలిపి సుమారుగా వెయ్యి గదులుంటాయి. ఇవన్నీ హై ఎండ్ ఫ్యామిలీ కోసమే అని చెప్పాలి.

 ఐటీ కంపెనీలు కూడా..
 ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మైక్రోసాఫ్ట్, డెల్, ఇన్ఫోసిస్ వంటి 72 ఐటీ కంపెనీలున్నాయి. వీటిలో సుమారుగా 35 నుంచి 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి మరో 22 ఐటీ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో తమ కార్యాలయాలను స్థాపించనున్నట్లు సమాచారం. వీరిలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఇక్కడికి రానున్నట్లు అంచనా. ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబై నుంచి తమ ఉద్యోగులను నెలకు 200 మందిని ఇక్కడికి పంపిస్తోంది. ఈ సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 5 వేలకు మించుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వీరిలో రూ.8 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలున్నవారున్నారు.

 ఉన్నత శ్రేణి వర్గాలకు చిరునామా..
 ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ధనవంతులకు మొదటి సొంతిల్లు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలిల్లో ఉండేది. మరి రెండో ఆస్తి బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ ఇకపై వారి రెండో ఆస్తి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండేందుకు ఇష్టపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నత వర్గాలుండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేందుకు.

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ వేతనాలున్న వారు గచ్చిబౌలిలో, తక్కువ వేతనాలున్న వారు కూకట్‌పల్లి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎలాగైతే ఉంటున్నారో అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పూర్తిగా హై ఎండ్ ఫ్యామిలీకి, మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలకు లింగంపల్లి సరైన ప్రాంతమని నిపుణులు చెబుతున్నారు. వీరందరికీ ప్రీమియం ఇళ్లను, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ వంటి ఆధునిక వసతులెన్నో కల్పించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 16 ఎకరాల్లో 58 ప్రీమియం విల్లాలను నిర్మిస్తోంది. ఒక్కో విల్లా ధర రూ.6 కోట్లకు పైమాటే.

 గజం స్థలం ధర రూ.60 వేలకు పైమాటే..
 ఐదేళ్ల క్రితం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గజం స్థలం ధర రూ.17 వేలుగా ఉండేది. కానీ, ఇప్పుడు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టినా దొరకని పరిస్థితి. ఇక్కడి అభివృద్ధిని ముందుగానే ఊహించిన కొంతమంది బిల్డర్లు ధర తక్కువగా ఉన్న సమయంలోనే అక్కడ పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement