రీట్స్‌లో పెట్టుబడులతో ఫండ్స్ పనితీరు మారుతుందా?
నేను కొన్ని మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి మార్చాలనుకుంటున్నాను. అది సరైన నిర్ణయమేనా ?
–హరిప్రసాద్, వైజాగ్
ఇది సరైన నిర్ణయం కాదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్ లాంటివే. పన్ను అంశాల పరంగా ఈక్విటీ ఫండ్స్‌కు వర్తించే ప్రయోజనాలు ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి. వీటికి ఉన్న ఏకైక ప్రయోజనం ఇదొక్కటే. ఈ ఫండ్స్ 6.5 శాతం వరకూ రాబడులను ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి మార్చారనుకుందాం. ఆ తర్వాత మార్కెట్ 10–15 శాతం పెరిగితే, ఆ లాభాలు మీరు మిస్ అవుతారు. అందుకని పెట్టుబడుల కేటాయింపు అనేది కీలకమైన విషయం. మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈక్విటీ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడులు పెట్టాలి?డెట్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి ? అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. మార్కెట్ తగ్గినప్పుడు డెట్ ఫండ్స్‌లో ఎక్కువగానూ, మార్కెట్ పెరిగినప్పుడు డెట్ ఫండ్స్‌లో తక్కువగానూ ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన పెట్టుబడి వ్యూహం కాదు. దీర్ఘకాలంపాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులను కొనసాగిస్తే ఈ మార్కెట్ ఒడిదుడుకులను మీరు తట్టుకోగలిగి మంచి రాబడులు పొందగలుగుతారు.
నేను గత కొంతకాలంగా ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటి ద్వారా వచ్చే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాబడులపై ఎమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? పన్ను రేటు ఏ రేంజ్‌లో ఉంటుంది?
–సౌభాగ్య, హైదరాబాద్
బ్యాలెన్స్‌డ్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో... డెట్, ఈక్విటీ కలగలసి ఉంటుంది. ఈక్విటీల్లో ఎంత వరకూ ఇన్వెస్ట్ చేస్తారు అనే అంశాన్ని బట్టి ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఈక్విటీ–ఆధారిత, లేదా డెట్–ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే, వాటిని ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌గానూ, 65 శాతానికి కంటే తక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే డెట్ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌గానూ పరిగణిస్తారు. ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వాటిపై వచ్చే రాబడులపై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండదు. ఏడాదికి లోపే ఈ ఫండ్స్‌ను విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ విషయానికొస్తే, మూడేళ్ల తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వచ్చే రాబడులపై 20 శాతం (ఇండెక్సేషన్ ప్రయోజనాలతో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్స్‌ను విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రీట్స్, ఇన్విట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి లభించింది కదా. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల వాటి పనితీరు ఏమైనా ప్రభావితమవుతుందా?
–భాస్కర్, విజయవాడ
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్విట్స్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్)లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతిస్తూ ఇటీవలే సెబీ నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తుల్లో 10 శాతం వరకూ రీట్స్, ఇన్విట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభ, నష్టాలను బేరీజు వేసుకొని ఫండ్ మేనేజర్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఆప్షన్స్. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ పనితీరు ఏ మేరకు ప్రభావితమవుతుందనేది ఇప్పుడే చెప్పలేం. మొత్తానికి ఎంతో కొంత ప్రభావమైతే తప్పకుండా ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల మంచి రాబడులు రావచ్చు. లేదా నష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పుడే ఒక అంచనా వేయడం కష్టమైన విషయమే.
గత ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 వేల పాయింట్ల దరిదాపుల్లో ఉంది. ఇప్పుడు 30 వేల పాయింట్లకు కొద్దిగా ఎగువున ఉంది. దీన్ని బట్టి సెన్సెక్స్ అండర్ వ్యాల్యూ అని చెప్పవచ్చా ? పెట్టుబడులను కొనసాగించాలా? ఆపేయాలా ?
–సురేందర్, వరంగల్
సెన్సెక్స్‌ను ఇలా విలువ కట్టడం సరైనది కాదు. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లు గత ఏడాది కాలంలో ఎన్నో మార్పులు, చేర్పులకు లోనయ్యాయి. కొన్ని చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను ఇచ్చాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ, ఏడాది కాలంలో ఈ షేర్ మంచి రాబడులను ఇచ్చింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా. గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ షేర్ ఇటీవలే 35–40 శాతం వరకూ లాభపడింది. మరోవైపు కొన్ని నష్టాలను మిగిల్చిన షేర్లు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఇచ్చిన షేర్లూ ఉన్నాయి. ఇలా సెన్సెక్స్‌లో మంచి, సగటు, అధ్వాన రాబడులు ఇచ్చిన షేర్లు ఉన్నాయి. ఒక ఇన్వెస్టర్‌గా మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్ పరిస్థితులు, ఒడిదుడుకులను పట్టించుకోకండి. వీటితో నిమిత్తం లేకుండా పెట్టుబడులను కొనసాగిస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి.