ప్రభుత్వ వ్యయంతోనే వృద్ధికి జోష్: హెచ్‌ఎస్‌బీసీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయాల పెంపు, ఆగిపోయిన ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించడం ఒక్కటే మార్గమని హెచ్‌ఎస్‌బీసీ ఒక నివేదికలో పేర్కొంది. భారీ అప్పులతో అటు కార్పొరేట్లు, మొండి బాకాయిల పెరుగుదలతో ఇటు బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణం వృద్ధి రేటు గాడిలో పడేందుకు ప్రభుత్వమే మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్థిక శాఖ తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ, కార్పొరేట్ రంగం నుంచి పెట్టుబడుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం స్పష్టంగా కనబడుతోందని నివేదిక వివరించింది.
ప్రైవేటు రంగ పెట్టుబడులకు ఊతమిచ్చేలా కీలక పాత్ర పోషించే విషయంలో... నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేలా చొరవ, ప్రభుత్వ వ్యయాల పెంపు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల్లో కొత్త ఆచరణాత్మక విధానాన్ని ప్రవేశపెట్టడం.. ఈ మూడు మార్గాలున్నాయని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ (క్యాపిటల్ మార్కెట్స్ విభాగం) ప్రాంజుల్ భండారీ పేర్కొన్నారు.
సీఎంఐఈ గణాంకాల ప్రకారం... ఆగిపోయిన 100 ప్రధాన ప్రాజెక్టుల్లో 66 శాతం ప్రైవేటు రంగంలోనివి కాగా, మిగతావి ప్రభుత్వ రంగానికి చెందినవి. భూసేకరణ, పర్యావరణ ఇతరత్రా అనుమతుల్లో జాప్యం, ముడివస్తువుల సరఫరారో అడ్డంకులు వంటివే ప్రాజెక్టులు నిలిచిపోయేందుకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.