న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్–2018 మార్చి) పేలవంగా ముగియనుందని స్వయంగా కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు శుక్రవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి.
ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి. గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది.
ముఖ్యాంశాలు చూస్తే...
♦ 2014 మేలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014–15లో వృద్ధి రేటు 7.5 శాతం. 2015–16లో ఈ రేటు 8 శాతమయితే, 2016–17లో 7.1 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3%గా నమోదవడం తెలిసిందే.
♦ తాజా అంచనాల ప్రకారం– ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతం (2016–17) నుంచి 4.6%కి పడిపోనుంది.
♦ ఇక వ్యవసాయ రంగం చూస్తే (అటవీ, మత్స్య రంగాలూ కలుపుకుని) వృద్ధి రేటు 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోనుంది.
♦ పెట్టుబడులకు సంబంధించి సూచీ– గ్రాస్ ఫిక్డ్‌డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్(జీఎఫ్‌సీఎఫ్) రూ.43.84 లక్షల కోట్లు. ఇది 2016–17లో రూ.41.18 లక్షల కోట్లు. ఈ పరిమాణం పెరుగుతుందన్న అంచనా పెట్టుబడుల వృద్ధి ప్రారంభమయ్యిందనడానికి సంకేతమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
♦ సీఎస్‌ఓ అంచనాల ప్రకారం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సర్వీసులు – ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి 7 శాతంగా నమోదవుతుందని అంచనా.
వివిధ అంచనాలు ఇలా...
♦ 2017–18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019–20 నాటికి 7.4%కి పెరుగుతుందని విశ్లేషించింది.
♦ ఇక 2017–18కి ఓఈసీడీ వృద్ధి అంచనా 6.7శాతం.
♦ ఫిచ్ రేటింగ్స్ 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2018–19కి 7.4% నుంచి 7.3%కి తగ్గించింది.
♦ ఇక మూడీస్ విషయంలో 2017–18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
♦ 2017–20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది.
♦ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7%.
Comments
Please login to add a commentAdd a comment