భారత్‌లో జనరల్ మోటార్స్
రూ.6,400 కోట్ల పెట్టుబడులు
♦ ప్రధానితో కంపెనీ ప్రతినిధుల భేటీ
♦ ఐదేళ్లలో పది కొత్త మోడళ్లు
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్‌లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్‌అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది కొత్త మోడళ్లను అందించనున్నామని, గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపి వేస్తామని జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బర్రా చెప్పారు.
మోదీతో కంపెనీ సీఈఓ సమావేశం..
మేరీ బర్రా కంపెనీ ఇతర ప్రతినిధులతో కలసి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తమ ప్రణాళికలను ఆయనకు వివరించారు. బర్రాతో పాటు జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా) స్టెఫాన్ జాకొ బి, జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా కూడా మోదీని కలిశారు.
నష్టాలొస్తున్నా, ముందుకే..
1996లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ భారత్‌లో ఇప్పటిదాకా వంద కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టింది. అప్పటి నుంచి ఈ కంపెనీకి రూ.2,740 కోట్ల నష్టం వచ్చింది. నష్టాలు వస్తున్నప్పటికీ, భారత్ ముఖ్యమైన మార్కెట్ కాబట్టి ఇంత భారీస్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని మేరీ బర్రా పేర్కొన్నారు. భారత్, చైనా, మెక్సికో, బ్రెజిల్ వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని మాతృకంపెనీ జనరల్ మోటార్స్ నిర్ణయించిందని తెలిపారు. దీంట్లో ఐదవ వంతు (వంద కోట్ల డాలర్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించారు. వీటిల్లో అధిక భాగం తెలగావ్ ప్లాంట్‌పై ఖర్చు చేస్తామని ఆమె తెలిపారు.
అక్టోబర్‌లో ట్రైల్‌బ్లేజర్
పదేళ్లలో ఐదు కొత్త మోడళ్లను భారత్‌లో అందించనున్నామని బర్రా తెలిపారు. దీంట్లో భాగంగా ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో, షెవర్లే బ్రాండ్ కింద స్పిన్ మల్టీ పర్పస్ వెహికల్‌ను 2017లో అందించనున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని తెలగావ్ ప్లాంట్ లో ఉత్పత్తి కార్యకలాపాలను కన్సాలిడేట్ చేసేందుకుగాను గుజరాత్‌లోని హలోల్ ప్లాం ట్‌లో ఉత్పత్తిని నిలిపేస్తున్నామని వివరించారు. హలోల్ ప్లాంట్‌లో వచ్చే ఏడాది జూన్ తర్వాత ఉత్పత్తి నిలిపివేస్తామని పేర్కొన్నారు. హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపేయడం వల్ల 1,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, తెలగావ్ ప్లాంట్‌పై పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 12,000 కొత్త ఉద్యోగాలొస్తాయని వివరించారు.