మరో ఐదేళ్లు.. క్రూడ్ నేలచూపులే!
దీనివల్ల భారత్‌కు లాభమే...
* రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు మరో 3-5 ఏళ్ల పాటు ఇప్పుడున్న దిగువ స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీనివల్ల చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సీఎన్‌ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత క్రూడ్ ధరల పరిస్థితి చాలా కాలంపాటు కొనసాగవచ్చని భావిస్తున్నాం.
కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉండొచ్చు. అంతేకాదు తొలిసారిగా డిమాండ్‌ను మించి సరఫరా పెరిగిపోవడం కారణంగా ముడిచమురు ధరలు పడిపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మార్కెట్ స్వరూపంలో భారీ మార్పులు వస్తేనే ప్రస్తుత ట్రెండ్ మారే అవకాశం ఉంది. మరోపక్క, అమెరికాలో క్రూడ్ ఉత్పత్తి గతంలో రోజుకు మిలియన్ బ్యారెళ్ల స్థాయి నుంచి ఇప్పుడు 9 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరింది. ఇది కూడా ధరల పతనానికి కారణమే. ఈ అధిక సరఫరా కారణంగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి(ఒపెక్) ప్రపంచ క్రూడ్ మార్కెట్‌పై పట్టు కోల్పోయింది. ఫలితంగా అధిక సరఫరాకు దారితీసి ధరలు ఘోరంగా పతనమవుతున్నాయి’ అని ముకేశ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తాజాగా క్రూడ్ రేటు 11 ఏళ్ల కనిష్టానికి(నెమైక్స్ లైట్ స్వీట్ క్రూడ్ 26 డాలర్లు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషనరీ) పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను కనిష్టస్థాయిల్లోనే కొనసాగిస్తాయని... అనుకున్నదానికంటే ఎక్కువ కాలమే ఈ ధోరణి ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.
ద్వితీయార్ధంలో రిలయన్స్ జియో సేవలు...
వాణిజ్యపరంగా 4జీ టెలికం సేవలు అందించేందుకు తమ రిలయన్స్ జియో సంస్థ తుది సన్నాహాలు చేస్తోందని... ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సిబ్బంది(దాదాపు 1.2 లక్షలు), వ్యాపార భాగస్వాములకు జియో సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తమ సేవల ప్రారంభంతో దేశంలోని 80 శాతం ప్రజలకు తాము హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నామని ముకేశ్ చెప్పారు. 2017 నాటికి దీన్ని 90 శాతానికి.. 2018 కల్లా దేశమంతా జియో సేవలను విస్తరింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.