Reliance Industries CMD Mukesh Ambani
-
భారీ పెట్టుబడులు, భారీ ఉద్యోగాలు-అంబానీ
సాక్షి, గువహటి: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అసోం రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. రాబోయే మూడేళ్లలో వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టునున్నామని శనివారం ప్రకటించారు. తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాదు మిగతా అన్ని టెలికాం మార్కెట్లకు అసోం ఎప్పుడూ తక్కువ ప్రాధాన్యత మార్కెట్‌గా ఉంది..కానీ రిలయన్స్ జియోకు మాత్రం కేటగిరి ‘ఎ’ గా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలను 5రెట్లు పెంచి నిలకడైన జీవనోపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అసోంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2018 ప్రారంభోత్సవం సందర్భంగా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం, టెలికాం, పర్యాటక రంగం, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాల్లో రూ. 2,500 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టనున్నామని అంబానీ ప్రకటించారు. తద్వారా రానున్న మూడేళ్లలో కనీసం 80,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రస్తుతం వున్న తమ రీటైల్ ఔట్లెట్లను 40కి పెంచుతామనీ, అలాగే పెట్రోల్ డిపోలను 27నుంచి 165కు పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 145 కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. భారీ ఉపాధి కల్పనపైనే తాము దృష్టిపెట్టిన తాము ఇప్పటికే 20వేల ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. పర్యాటక రంగంలో, సంస్థకు చెందిన సీఎస్ఆర్ విభాగం రిలయన్స్ ఫౌండేషన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో వన్యప్రాణుల రక్షణ, ఎకో టూరిజం ప్రోత్సాహానికి గాను ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు అసోం ప్రభుత్వంతో కలిసి ఒక అగ్రశ్రేణి ఫుట్‌బాల్ అకాడమీని స్థాపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాలపై దృష్టి పెట్టి ఇటీవలి కాలంలో ఉత్తమ బడ్జెట్ అందించారని ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం తపన పడుతున్న పాపులర్ ప్రధాని నాయకత్వంలో దేశంలో సరైన సమయంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 ఏర్పాటు చేసినందుకు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్నుకూడా అంబానీ అభినందించారు. అసోం రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందనీ, ముఖ్యంగా జాతీయ సగటు కంటే దాని తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని పేర్నొన్నారు. రూ. 5వేలకోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో అతిపెద్ద ప్రైవేటురంగ పెట్టుబడిదారుగా రిలయన్స్ అవతరించిదని అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం అసోంలో జియో వినియోగారుల సంఖ్య 30లక్షలుగా ఉందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. -
మరో ఐదేళ్లు.. క్రూడ్ నేలచూపులే!
దీనివల్ల భారత్‌కు లాభమే... * రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు మరో 3-5 ఏళ్ల పాటు ఇప్పుడున్న దిగువ స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీనివల్ల చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సీఎన్ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత క్రూడ్ ధరల పరిస్థితి చాలా కాలంపాటు కొనసాగవచ్చని భావిస్తున్నాం. కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉండొచ్చు. అంతేకాదు తొలిసారిగా డిమాండ్‌ను మించి సరఫరా పెరిగిపోవడం కారణంగా ముడిచమురు ధరలు పడిపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మార్కెట్ స్వరూపంలో భారీ మార్పులు వస్తేనే ప్రస్తుత ట్రెండ్ మారే అవకాశం ఉంది. మరోపక్క, అమెరికాలో క్రూడ్ ఉత్పత్తి గతంలో రోజుకు మిలియన్ బ్యారెళ్ల స్థాయి నుంచి ఇప్పుడు 9 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరింది. ఇది కూడా ధరల పతనానికి కారణమే. ఈ అధిక సరఫరా కారణంగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి(ఒపెక్) ప్రపంచ క్రూడ్ మార్కెట్‌పై పట్టు కోల్పోయింది. ఫలితంగా అధిక సరఫరాకు దారితీసి ధరలు ఘోరంగా పతనమవుతున్నాయి’ అని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాజాగా క్రూడ్ రేటు 11 ఏళ్ల కనిష్టానికి(నెమైక్స్ లైట్ స్వీట్ క్రూడ్ 26 డాలర్లు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషనరీ) పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను కనిష్టస్థాయిల్లోనే కొనసాగిస్తాయని... అనుకున్నదానికంటే ఎక్కువ కాలమే ఈ ధోరణి ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ద్వితీయార్ధంలో రిలయన్స్ జియో సేవలు... వాణిజ్యపరంగా 4జీ టెలికం సేవలు అందించేందుకు తమ రిలయన్స్ జియో సంస్థ తుది సన్నాహాలు చేస్తోందని... ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సిబ్బంది(దాదాపు 1.2 లక్షలు), వ్యాపార భాగస్వాములకు జియో సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తమ సేవల ప్రారంభంతో దేశంలోని 80 శాతం ప్రజలకు తాము హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురానున్నామని ముకేశ్ చెప్పారు. 2017 నాటికి దీన్ని 90 శాతానికి.. 2018 కల్లా దేశమంతా జియో సేవలను విస్తరింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.