పసిడి దిగుమతులు వెలవెల..!
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.5 శాతం తగ్గాయి. విలువ రూపంలో 15.42 బిలియన్ డాలర్ల నుంచి 6.08 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొన్నాయి.
విదేశీ మారకద్రవ్య చెల్లింపుల అవసరం తగ్గడం వల్ల ఇది కరెంట్ అకౌంట్ (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ-పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం)కు లాభించే పరిణామమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కరెంట్ అకౌంట్ మిగులు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలూ వెలువడుతున్నాయి.