
1,250 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందన్న అంచనాలకు అనుగుణంగా 22వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి పరుగుపెట్టింది. అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గడిన వారంలో 21 డాలర్లు లాభపడి 1,279 వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఇక్కడ పసిడి దాదాపు 30 డాలర్లు లాభపడింది. 200 రోజుల కదలికల సగటు సైతం 1,277.70 డాలర్లు కావడం, ఈ కీలక స్థాయిపైనే పసిడి ముగియడం, వారంలో డాలర్ ఇండెక్స్ 1.08 డాలర్ల మేర పతనమై 92.88కి పడిపోవడం వంటి అంశాలు సమీపకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్న అంచనాలకు ఊతం ఇస్తున్నాయి.
అయితే 1,310 డాలర్ల స్థాయికి దాటగలిగి, స్థిరత్వం పొందితే తిరిగి ఈ మెటల్ విలువ 1,360 డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికా పన్ను వ్యవస్థలో మార్పులకు సంబంధించి అస్పష్టత, క్రిస్మస్, నూతన సంవత్సర ఉత్సవాలు, ఈక్విటీల్లో లాభాల స్వీకరణకు అవకాశాలు వంటి అంశాలు సమీప వారాల్లో పసిడిని పటిష్టస్థాయిలో ఉంచుతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్టస్థాయి 90.99 వైపు పయనిస్తే, అది పసిడి అప్‌ట్రెండ్‌కు మరింత ఊతం ఇస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. మూడు వారాల వరుస పతనం అనంతరం పసిడి తిరిగి గడచిన రెండు వారాల్లో పురోగమన దిశలోకి మారింది.
అప్పట్లో ఒక దశలో 1,239 డాలర్లకు పడిపోయిన పసిడి మళ్లీ వారం చివరకల్లా 9 డాలర్ల లాభాల బాటకు చేరి, 1,258 డాలర్ల (డిసెంబర్ 15తో ముగిసిన వారం) పురోగతితో ముగిసింది. దాదాపు 20,000 డాలర్ల స్థాయికి చేరిన బిట్ కాయిన్ గడచిన వారంలో భారీ పతనాన్ని నమోదుచేసుకున్న సంగతి ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం. ఉత్తరకొరియాతో ‘అణు’ ఉద్రిక్తతల పరిస్థితులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో పసిడి ఇప్పటికిప్పుడు బేరిష్ «ధోరణిలోకి జారకపోవచ్చన్నది పలువురి విశ్లేషణ.
దేశీయంగా స్పీడుకు రూపాయి అడ్డు!
అంతర్జాతీయంగా పసిడి లాభపడినా.. దేశీయంగా రూపాయి పటిష్టత వల్ల (అంతర్జాతీయ మార్కెట్‌లో 64.12) ఆ ప్రభావం దేశంలో పెద్దగా కనపడలేదు. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో వారంలో ధర రూ.211 మాత్రమే పెరిగి రూ.28,665కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారంవారీగా 99.9 స్వచ్ఛత ధర రూ.145 పెరిగి రూ. 28,845 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో లాభపడి రూ.28,695కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.385 లాభపడి రూ. 37,180 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment