పసిడికి ‘దేశీయ’ మెరుపు!
ముంబైలో రూ. 525 పెరుగుదల; రూ.29,000 పైకి జంప్...
ముంబై: దేశీయంగా నెలకొన్న పటిష్ట డిమాండ్, శుక్రవారం నాడు పసిడికి మెరుపునిచ్చింది. ముంబై స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర గురువారం ముగింపుతో పోల్చిచూస్తే.. రూ.525 ఎగసి రూ.29,095కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగసి రూ.28,945 పెరిగింది. ఇక వెండి కేజీ ధర రూ.395 ఎగసి రూ.37,690కి పెరిగింది. ముంబైలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రధాన స్పాట్ మార్కెట్లు అన్నింటిలో పసిడి ధర శుక్రవారం భారీగా ఎగసింది. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల కొనుగోళ్లు తాజా డిమాండ్‌కు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కడపటి సమాచారం అందేసరికి అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లలో కూడా పసిడి లాభాల్లోనే ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు ఐదు డాలర్ల లాభంతో 1,231 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో రూ.250 లాభంతో రూ.29,560 వద్ద ట్రేడవుతోంది.