ధరల నీడన.. మెరవని పసిడి
♦ అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతే!
♦ గతేడాదితో పోలిస్తే విక్రయాలు 30 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ధన త్రయోదశి తర్వాత బంగారాన్ని అత్యధికంగా కొనేది అక్షయ తృతీయ రోజునే. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సోమవారం నాటి అక్షయ తృతీయకు పుత్తడి మెరవలేదు. గతేడాది తృతీయతో పోలిస్తే ఈసారి అమ్మకాలు కేవలం 30 శాతం లోపుకే పరిమితమయ్యాయి. పసిడి ధర పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. పెళ్లి ముహూర్తాలు ఇప్పట్లో లేకపోవడమూ దీనికి తోడైంది. దీంతో వర్తకులు ఎన్ని ఆఫర్లిచ్చినా వినియోగదారులను మెప్పించలేకపోయారు.
అయితే మూడు నెలలకుపైగా వ్యాపారాలు లేక వెలవెలబోయిన దుకాణాలు అక్షయ తృతీయ పుణ్యమా అని కొద్ది మంది కస్టమర్లతో కాసింత ఉపశమనం పొందాయి. అయితే మొత్తంగా చూస్తే... ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరక్కపోవడం కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. దీనికి పలు కారణాలను ఈ రంగంలోని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ధరల తీవ్రత ఒక అంశం. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉన్నా... పసిడిపై మోజు తగ్గబోదని ఈ రంగంలో పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒడిదుడుకుల్లో ధర..
దాదాపు గత సంవత్సన్నర కాలంలో బంగారం ధర భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. దేశీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి దీనికి కారణాలు ఎలాఉన్నా... ఒడిదుడుకుల ధరల వల్ల పసిడి కొనుగోళ్లకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపించడం లేదని బులియన్ ట్రేడర్లు అంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, వివిధ కేంద్ర బ్యాంకుల విధానాల్లో నిలకడ లేకపోవడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. దాంతో దేశీయంగా 2012లో 24 క్యారట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ. 30,000 వరకూ పెరిగిన ధర 2013 జూన్‌లో రూ. 25 వేలకు సమీపంలోకి వచ్చింది. 2014లో ప్రారంభంలో తిరిగి రూ. 35,000 వరకూ పెరిగిపోయింది.
అదే ఏడాది అక్షయ తృతీయ సమయానికి (మే 2న) రూ.29 వేలకూ అటూ ఇటూగా పలికింది. ఆ తర్వాతి సంవత్సరం అక్షయ రోజున రూ.27 వేలకు వచ్చింది. ఈ ఏడాది మే 9న రూ. 30 వేలకు ఎగసింది. ప్రస్తుత ధరలో చూస్తే ఏడాదిలోనే 10 శాతంపైగా ఎగసింది. వేలల్లో హెచ్చు తగ్గులుండడంతో కస్టమర్లు బంగారం కొనుగోలుకు దూరమయ్యారని రిద్ధి సిద్ధి బులియన్స్ (ఆర్‌ఎస్‌బీఎల్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హెడ్ జి.శేఖర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వినియోగదార్లు పు త్తడిపై విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు.
అప్పుడు కొని ఇప్పుడు..
2013 జూన్‌లో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొన్నారు. ఆ సమయంలో చాలా దుకాణాల ముందు పెద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. ఆ స్థాయిలో ఎగబడ్డ కస్టమర్లు ఇప్పుడు తమవద్ద ఉన్న పసిడిని అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారని వర్తకులు చెబుతున్నారు. అందుకే భారత్‌కు దిగుమతవుతున్న బంగారం పరిమాణం తగ్గుతూ వస్తోంది. బంగారు కడ్డీల కొనుగోళ్లు దాదాపు లేవని వర్తకులు అంటున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు ముందస్తుగా కడ్డీలు కొనుక్కుని అవసరానికి ఆభరణాలుగా మార్చుకునేవారు ఎక్కువే. అలాంటిది ధరల హెచ్చుతగ్గులతో కడ్డీల వైపే కస్టమర్లు చూడ్డం లేదని చెబుతున్నారు. 2015 ఏప్రిల్‌లో భారత్‌కు 60 టన్నుల బంగారం దిగుమతైంది. 2016 ఏప్రిల్‌లో ఇది 19.6 టన్నులకే పరిమితమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014-15లో 1,050 టన్నుల పసిడి దిగుమతైతే, 2015-16లో 10 శాతం తగ్గి 950 టన్నులకు చేరింది.
మెరవని వెండి..
అవసరం ఉంటేనే బంగారాన్ని కొనే పరిస్థితి ఉందని ఆర్‌ఎస్‌బీఎల్ ప్రతినిధి శేఖర్ అన్నారు. పసిడిని పెట్టుబడి సాధనంగా భావించడం గతం అని వ్యాఖ్యానించారు. బంగారం డిపాజిట్ పథకం అంతగా ఆకట్టుకోలేదని, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెద్దగా పెరగడం లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో రియల్టీ బాగుంది. దీంతో రియల్టీ వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారని వివరించారు. బంగారు ఆభరణాలకే పెద్దగా డిమాండ్ లేదు. అటువంటిది ఈసారి వెండి వస్తువుల వైపు చూసే వారే కరువయ్యారని హైదరాబాద్‌కు చెందిన ఒక విక్రేత వెల్లడించారు. అక్షయ తృతియ రోజున ఉంగరాలు, చెవి కమ్మల వంటి చిన్న చిన్న ఆభరణాలు అధికంగా అమ్ముడయ్యాయని కొత్తపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బంగారం విభాగం మేనేజర్ జి.నాగకిరణ్ తెలిపారు. ఆశించిన దానికంటే వ్యాపారం ఎక్కువైందని ఈ సందర్భంగా చెప్పారు.
పుత్తడిపై మోజు తగ్గదు..
భారత బంగారు ఆభరణాల విపణిలో కార్పొరేట్ కంపెనీల వాటా కేవలం 5 శాతమేనని బులియన్ రంగ విశ్లేషకుడొకరు తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటించాయని అన్నారు. కొన్ని కంపెనీలైతే కాస్ట్ టు కాస్ట్ విక్రయించాయని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో అమ్మకాలు నెమ్మదించినా బంగారంపై మోజు తగ్గదని బులియన్ రంగ నిపుణులు బి.మహాబలేశ్వర రావు తెలిపారు. అమ్మకాలు తగ్గడమనేది తాత్కాలికమని అన్నారు. చైనా బంగారం కొనుగోళ్లను పెంచింది. మ్యూచువల్ ఫండ్లు సైతం పుత్తడి కొనుగోళ్లను అధికం చేశాయి. అంతర్జాతీయంగా గిరాకీ పెరిగి పసిడి ధర అధికమవుతోందని అన్నారు.
♦ 30వేల దిగువకు పుత్తడి ధర
♦ అంతర్జాతీయ మార్కెట్లోనూ పతనమే
న్యూఢిల్లీ/ ముంబై: బంగారం ధరలు రూ.30వేల దిగువకు పడిపోయాయి. పుత్తడి ధరలు పతనం కావడం ఇది వరుసగా రెండో రోజూ. ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బలహీనంగా ఉండటంతో ఇక్కడ కూడా ధరలు పడిపోయాయని ట్రేడర్లు పేర్కొన్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.29,850కు, 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 తగ్గి రూ.29,700కు చేరింది.
ఇక కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.40,600కు చేరింది. అలాగే ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల పుత్తడి ధర 30,005 నుంచి రూ. 29,850 స్థాయికి, 99.5 స్వచ్ఛతగల బంగారం ధర రూ. 29,855 నుంచి రూ. 29,700 స్థాయికి తగ్గింది. అంతర్జాతీయంగా చూస్తే, సోమవారం న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.89 శాతం తగ్గి 1,263 డాలర్లకు తగ్గిపోయింది. ప్రపంచ మార్కెట్లో లాభాల స్వీకరణ కారణంగా పుత్తడి ధర తగ్గిందని ట్రేడర్లు చెప్పారు. ఇక వెండి ధర 2.55 శాతం తగ్గి 16.99 డాలర్లకు చేరింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే శుభస్కరమన్న సెంటిమెంట్ ఈ ఏడాది పెద్దగా ఫలితమివ్వలేదని, ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు అమ్మకాలు తగ్గాయని ట్రేడర్లు పేర్కొన్నారు.