ఒక్కరోజులోనే కిందకి పడిన బంగారం
సాక్షి, న్యూఢిల్లీ : పరుగులు పెట్టిన పుత్తడి ఒక్కరోజులోనే మళ్లీ భారీగా కిందకి పడిపోయింది. ఉత్తరకొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిందనే వార్తల నేపథ్యంలో మంగళవారం అమాంతం పైకి ఎగిసిన బంగారం ధరలు, బుధవారం 350 రూపాయల మేర ఢమాలమన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, దానికి తోడు స్థానిక జువెల్లర్ల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు పడిపోయి, రూ.30,100గా నమోదైంది.
వెండి కూడా 500 రూపాయల మేర క్షీణించి, 41వేల రూపాయల మార్క్ కిందకి చేరింది.. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి పెద్దగా డిమాండ్ రాకపోవడంతో కేజీ వెండి ధర బులియన్ మార్కెట్‌లో రూ.40,600గా నమోదైంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 0.07 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,308.60 డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ కూడా 0.43 శాతం క్షీణించి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పడిపోయి రూ.30,100గా, రూ.29,950గా నమోదయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఇది రూ.550 మేర పెరిగిన సంగతి తెలిసింది.