
పసిడి ఇంకా పడకపోవచ్చు..!
♦ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా..
♦ చైనా తాజా కొనుగోళ్లు జరపవచ్చన్న అభిప్రాయం
♦ అమెరికా సెప్టెంబర్ ‘ఉపాధి’ బలహీనత నేపథ్యం
ముంబై/న్యూయార్క్: బంగారం ధర ఇక స్థిరపడవచ్చన్న అంచనాలు వినవస్తున్నాయి. పసిడి ధర వరుసగా ఎనిమిది ట్రేడింగ్ షెషన్ల నుంచీ పడుతూ వస్తోంది. ఈ ఏడాది ధర ఇలా పడటం ఇదే తొలి సారి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారం రోజుల్లో ఔన్స్‌కు (31.1 గ్రాములు) 59 డాలర్లు తగ్గి, 1,259 డాలర్లకు దిగింది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెరగవచ్చన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి బాగుండడంతో డాలర్ బలపడ్డం, ఫెడ్ రేటు పెంపు అంచనాలు పసిడికి మదుపుదారులను దూరం చేశాయి.
అంచనాలు ఇలా...
అయితే ఇకపై పసిడి ధర మరింత పడకపోవచ్చన్నది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా. భౌతిక బంగారానికి వచ్చే డిమాండ్ పసిడి మరింత పతనం కాకుండా అడ్డుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా. ప్రస్తుత పతనం తరువాత చైనా మరో దఫా పసిడి కొనుగోళ్లకు దిగవచ్చన్న అంచనాలున్నట్లు బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరకు పసిడి మొత్తంగా 1,280 డాలర్ల వద్ద ఉంటుందని బ్యాంక్ అంచనా వేస్తోంది.
ఇక శుక్రవారం వెలువడిన అమెరికా ఉపాధి కల్పనా గణాంకాలు సెప్టెంబర్‌లో నిరాశాజనకంగా ఉండడం కూడా పసిడి ధర మరింత పడకపోవచ్చనడానికి కారణంగా కనబడుతోంది. ఈ నెలలో 1,56,000 మందికే ఉపాధి కల్పించినట్లు వెల్లడయిం ది. ఇది అంచనాలకన్నా తక్కువ. నిజానికి ఈ సంఖ్య 1,70,000 - 1,76,000 మధ్య ఉంటుందని అంచనావేశారు. వృద్ధి కేవలం 0.1 శాతం నమోదై ఐదు శాతానికి చేరింది. ఇది కూడా ఫెడ్ రేటు కోత మరింత ఆలస్యం జరగవచ్చన్న అంచనాలకు ఊతం ఇస్తోంది. ఇది పసిడి పెరుగుదలకు లాభించే అంశంగా భావిస్తున్నారు.
దేశీయంగా ఇలా...
అంతర్జాతీయ ధోరణి దేశీయంగా బలంగా కనబడింది. పసిడి ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో గడచిన వారంలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.1,355 తగ్గి రూ.29,995కు చేరింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.29,845కు దిగింది. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.3,930 పడి రూ.42,385కు చేరింది.
ఔన్స్ 31.1గ్రాములు - ప్రస్తుత ధర 1,259 డాలర్లు -
డాలర్‌కు రూపాయి మారకపు విలువ దాదాపు రూ. 68