అక్షయ తృతీయపై వ్యాపారుల దృష్టి
బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని అంచనా
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. శుభ దినంగా భావించే అక్షయ తృతీయనాడు గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే పసిడి అమ్మకాలు 20 నుంచి 30 శాతం మేర పెరుగుతాయని భావిస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ నితిన్ ఖండేల్‌వాల్ తెలిపారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) పీఆర్ సోమసుందరం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పెళ్లిళ్ల సీజన్, వీకెండ్‌లో రావడం కొనుగోళ్లకు మరీ కలిసి వస్తున్న అంశంగా పీఎన్ గాడ్జిల్ జ్యూయెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ నుంచి వినియోగదారుల్లో పసిడి పట్ల మరింత సానుకూల ధోరణి ఏర్పడినట్లు భావిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌పీ జ్యూయెలర్స్ డైరెక్టర్ ఆదిత్య పాథే వివరించారు.
ప్రస్తుత ధరలు ఇలా...
ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్ ఫ్యూచర్స్‌లో కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా) ధర స్వల్ప నష్టంతో 1,264 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో రూ. 90 నష్టంతో రూ. 28,725 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర బుధవారం కిత్రం రోజుతో పోల్చితే, రూ.205 తగ్గి రూ. 28,950 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.28,800 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 555 తగ్గి రూ.40,980కి దిగింది.