సాక్షి,న్యూఢిల్లీః మగువలకు పసిడి పట్ల పట్టరాని క్రేజ్ నెలకొన్నా ఈ పండగ సీజన్‌లో ప్రత్యేకించి దీపావళికీ బంగారం మెరుపులు మసకబారవచ్చని ట్రేడర్లు చెబుతున్నారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు, మనీల్యాండరింగ్ నియంత్రణ చర్యల నేపథ్యంలో గోల్డ్‌కు జనం దూరమవుతున్నారు. పండుగ సీజన్ అయినా ప్రభుత్వ నియంత్రణలతో ప్రజలు బంగారం కొనేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని, ఈ సెంటిమెంట్ పెళ్లిళ్ల కొనుగోళ్లపైనా ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అభిప్రాయపడ్డారు. గత ఏడాది నోట్ల రద్దుకు ముందుగా దీపావళి రావడం, రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో పసిడికి భారీ డిమాండ్ నెలకొన్నదన్నారు.
ఇక జ్యూవెలరీ పరిశ్రమను ప్రభుత్వం మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం పరిధిలోకి తేవడంతో బంగారం కొనుగోలుపై పలు నియంత్రణలు, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటికి తోడు జీఎస్‌టీలో మూడు శాతం పన్ను శ్లాబ్ కిందకు బంగారాన్ని తీసుకురావడంతో పసిడిపై పన్ను భారమూ అధికమైంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన క్రమంలో ఆభరణాల పరిశ్రమ కుదురుకునేందుకు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.