నిఫ్టీ 7,600 పాయింట్లకు!
ముంబై: భారత్‌పై అంతర్జాతీయ అనిశ్చితి ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టాయని.. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్న సంకేతాలు కనబడుతున్నాయని అమెరికన్ బ్రోకరేజి దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. దీంతో భారత్‌ను ‘ఓవర్‌వెయిట్’(మరింత వృద్ధికి అవకాశం) స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాదు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ ఈ ఏడాది 7,600 పాయిట్లను తాకొచ్చని కూడా అంచనా వేసింది. నిఫ్టీ తాజాగా ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. ‘ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో క్యూ2(ఏప్రిల్-జూన్), ఆ తర్వాత నుంచి వృద్ధి రేటు రికవరీ మెరుగుపడనుంది. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడం(క్యూ3లో 0.9 శాతమే), ఫారెక్స్ నిల్వల పెరుగుదల, డాలరుతో రూపాయి విలువ కొంత స్థిరపడటం వంటి సానుకూలాంశాలు ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనున్నాయి’ అని గోల్డ్‌మన్ శాక్స్ తన రీసెర్చ్ నోట్‌లో వెల్లడించింది.
సాధారణ ఎన్నికలు దేశీ స్టాక్ మార్కెట్‌కు కీలకమైనవని, ఎన్నికల ప్రభావంతో లాభపడేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌పై దృష్టిపెట్టాలని తన క్లయింట్లకు సూచించింది. ‘ఏప్రిల్-మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల పురోగతిపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. గత ఎన్నికల సమయంలో మార్కెట్ కదలికలు, వాల్యుయేషన్(విలువ), పెట్టుబడి ప్రవాహాలను విశ్లేషిస్తే... ప్రస్తుత ఎన్నికల ముందస్తు(ప్రి ఎలక్షన్) ర్యాలీ మరింత జోరందుకోవడానికి ఆస్కారం ఉంది’ అని అభిప్రాయపడింది. ఎన్నికలతో లాభపడే స్టాక్స్‌లో ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ వంటివి ఉన్నాయని కూడా తెలిపింది.
అయితే, ఎన్నికల ఫలితాలు అనిశ్చితికి దారితీస్తే స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోయే రిస్క్‌లు పొంచిఉన్నాయని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఐటీ, ఇంధన రంగాలపై ఓవర్‌వెయిట్ స్థాయిని కొనసాగిస్తున్నామని, ఆటోమొబైల్ రంగాన్ని కూడా ఇప్పుడు దీనిలోకి తీసుకొచ్చినట్లు బ్రోకరేజి దిగ్గజం వెల్లడించింది. బ్యాంకులు, యుటిలిటీ రంగాలను మార్కెట్ వెయిట్; హెల్త్‌కేర్, టెలికం, రియల్టీ రంగాలను అండర్‌వెయిట్ స్థాయిలో ఉంచినట్లు వివరించింది.