Larsen and Toubro
-
భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకే.. విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రతిష్టాత్మక భారత్ బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీని విలువ రూ.7 వేల కోట్లపైనే ఉంటుందని సమాచారం. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు మీటింగ్ జులై 25న జరుగనుంది. ఈ సందర్భంగా షేర్ల బైబ్యాక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును బోర్డు పరిశీలించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు సమావేశంలో స్వీకరించనున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో భాగమైన 135.45 కిలో మీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్-C3 ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి తమ నిర్మాణ యూనిట్ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ పొందినట్లు కంపెనీ ప్రత్యేక ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ఈ ప్యాకేజీ పరిధిలో స్టేషన్లు, ప్రధాన నదీ వంతెనలు, డిపోలు, సొరంగాలు, ఎర్త్ స్ట్రక్చర్లు, స్టేషన్లు తదితర నిర్మాణాలను ఎల్అండ్టీ కంపెనీ చేపట్టనుంది. ఈ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దాదాపు 508 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీన్ని ఎంఏహెచ్ఎస్ఆర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో 155.76 కి.మీ, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 4.3 కి.మీ, గుజరాత్ రాష్ట్రంలో 348.04 కి.మీ మేర ఉంటుంది. మెగా ఆర్డర్ దక్కించుకున్న అనంతరం బీఎస్ఈలో ఎల్అండ్టీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,594.40కి చేరుకున్నాయి. 2023-24 మొదటి త్రైమాసిక పలితాలను జులై 25న జరిగే సమావేశంలో ఎల్అండ్టీ బోర్డ్ పరిగణనలోకి తీసుకోనుంది. -
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు?
ముంబై: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మౌలిక రంగ ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్‌నకు చెందిన ఈ రెండు సంస్థలు విలీనమైతే 22 బిలియన్ డాలర్ల(రూ. 1,65,000 కోట్లు) విలువైన ఐటీ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు అంచనా. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ బోర్డులు విలీనానికి అనుగుణంగా షేర్ల మార్పిడి అంశాన్ని పరిశీలించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మాతృ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) లిస్టెడ్ ఐటీ కంపెనీలు రెండింటి విలీనానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేసినట్లు వెల్లడించాయి. తద్వారా గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలతో విలీన సంస్థ పోటీపడేందుకు వీలుంటుందని మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ భావిస్తున్నట్లు తెలియజేశాయి. వచ్చే వారమే? మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నియంత్రణలోని ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనానికి షేర్ల మార్పిడి అంశంపై వచ్చే వారం మొదట్లోనే బోర్డులు చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీను 2019లో ఎల్అండ్టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 61 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తాజాగా రూ. 65,287 కోట్లు (8.7 బిలియన్ డాలర్లు)స్థాయికి చేరింది. ఇక ఎల్అండ్టీకి 74 శాతం వాటా కలిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విలువ రూ. 1,02,825 కోట్లు(13.7 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి విలీన సంస్థ మార్కెట్ క్యాప్ 22 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. క్లయింట్ల విషయంలో.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనమైతే క్లయింట్లు లేదా బిజినెస్‌లో పరస్పర అతిక్రమణ నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వీసులకు అధిక ధరలు పొందేందుకు, వ్యయాల నియంత్రణకు రెండు సంస్థల మధ్య ఒప్పందం దారి చూపుతుందని అంచనా వేశాయి. అయితే విలీనం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వీలున్నట్లే.. ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నదని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్అండ్టీ ప్రతినిధి ఒకరు నిరాకరించగా.. మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నుంచి స్పందన కరువైనట్లు తెలియజేశాయి. మైండ్‌ట్రీ క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాలను సోమవారం(18న) విడుదల చేయగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్పనితీరు నేడు(19న) వెల్లడికానుంది. కోవిడ్–19 ఎఫెక్ట్ కొద్ది నెలలుగా ప్రపంచస్థాయిలో విస్తరించిన కోవిడ్–19 మహమ్మారితో డిజిటైజేషన్‌కు డిమాండు బాగా పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీలకు బిజినెస్ అవకాశాలు భారీగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ ఔట్సోర్సింగ్ దిగ్గజాలు సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషీన్‌లెర్నింగ్ సపోర్ట్ తదితర నవతరం సేవలు అందించేందుకు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. షేర్లు డీలా: మైండ్‌ట్రీ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 3,965 వద్ద నిలవగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.5 శాతం నష్టంతో రూ. 5,890 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మైండ్‌ట్రీ రూ. 4,020–3,834 మధ్య ఊగిసలాడింది. మైండ్‌ట్రీ లాభం జూమ్ న్యూఢిల్లీ: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 49% జంప్‌చేసి రూ. 473 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో రూ. 317 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతంపైగా ఎగసి రూ. 2,897 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,109 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక పూర్తి ఏడాదికి మైండ్‌ట్రీ కన్సాలిడేటెడ్ నికర లాభం 49% వృద్ధితో రూ. 1,653 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 7,968 కోట్ల నుంచి రూ. 10,525 కోట్లకు ఎగసింది. ఇది 31% అధికం. షేరుకి రూ. 27 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. కాగా, మెండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్ మధ్య విలీన వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనంటూ మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ దేవశిష్ కొట్టిపారేశారు. చదవండి: -
1,800 మంది ఫ్రెషర్లను నియమించుకున్న ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) 1,800 మందికిపైగా ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రాంగణ నియామకాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించింది. 300లకుపైగా కళాశాలల నుంచి 36,000ల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించింది. 8,000 ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో కంపెనీ నిర్వహించింది. ఎల్అండ్టీ అనుబంధ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేర్వేరుగా ఫ్రెషర్లను నియమిస్తున్నాయి. -
ఆర్మీ స్వదేశీ వారధి
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్లతో దీన్ని రూపొందించారు. -
నేటి నుంచే ఎల్&టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
న్యూఢిల్లీ : దేశీయ ఆరో అతిపెద్ద ఐటీ సంస్థ ఎల్&టీ ఇన్ఫోటెక్ తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నేటినుంచి ప్రారంభంకానుంది. తొలి పబ్లిక్ ఆఫర్ తో కంపెనీ రూ.1,243 కోట్లను సమీకరించనుంది. రూ.1.75 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో అమ్మకానికి ఉంచనుంది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.705-710గా నిర్ణయించింది. రూ.710 ధరతో రూ.1,243.50 కోట్లను...రూ.705 ధరతో రూ.1,233.75 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. నేటి నుంచి జూలై 13 వరకూ ఈ సబ్ స్క్రిప్షన్ కొనసాగనుంది. ఈ ఆఫర్ తో మార్కెట్లో ఎల్&టీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎన్ఎస్ఈ లో ఎల్&టీ రూ.28.80 లాభపడి రూ.1561.80గా నమోదవుతోంది. యాంకర్ పెట్టుబడిదారులకు రూ.710 లకు షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఇప్పటికే రూ.373 కోట్లను కంపెనీ సమీకరించింది. కొటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యురిటీస్ ఈ ఇష్యూను మేనేజ్ చేయనున్నాయి. ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవెన్యూలను వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.13,500 కోట్లకు(2 బిలియన్ డాలర్లకు) పెంచనున్నట్టు ఎల్&టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏమ్ నాయక్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవన్యూలు, ఇతర ఆదాయాలు రూ.6,143.02 కోట్లకు పెరిగాయి. పన్నుల తర్వాత లాభాలు రూ.922.17 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూల పరంగా, ఉద్యోగుల పరంగా భారతీయ ఐటీ సర్వీసులో ఎల్&టీ ఇన్ఫోటెక్ ఆరవ అతిపెద్ద కంపెనీగా ఉంది. -
ఎల్అండ్టీ లాభం రూ.867 కోట్లు
10 శాతం పెరుగుదల * గట్టెక్కించిన ఇన్ఫ్రా వ్యాపారం * 17 శాతం పెరిగిన ఆర్డర్ల బుక్ ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం, లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు రూ.867 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.797 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం మెరుగుపడడం, రియల్టీ, సర్వీసెస్ వ్యాపారాల నుంచి అధిక ఆదాయం రావడంతో నికర లాభం పెరిగిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్. శంకర్ రామన్ పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.21,732 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.23,848 కోట్లకు పెరిగిందని వివరించారు. దీంట్లో అంతర్జాతీయ వ్యాపారం వాటా రూ.6,400 కోట్లని తెలిపారు. 17 శాతం పెరిగిన ఆర్డర్లు గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆర్డర్-బుక్ 17 శాతం వృద్ధితో రూ.2,25,788 కోట్లకు చేరిందని రామన్ పేర్కొన్నారు. దీంట్లో నాలుగో వంతు అంతర్జాతీయ ఆర్డర్లేనని వివరించారు. ఇన్ఫ్రా వ్యాపారం 22 శాతం వృద్ధి ఇన్ఫ్రా వ్యాపారం రాబడి 22 శాతం వృద్ధితో రూ,11,553 కోట్లకు పెరిగిందని రామన్ వివరించారు. ఈ విభాగంలో రూ.24,032 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని పేర్కొన్నారు. అవకాశాలు అందుకుంటాం.. రుణ లభ్యత, అంతర్జాతీయ పరిస్థితి సహా వివిధ ప్రభుత్వ చర్యల కారణంగా వ్యాపార పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటి ఫలితంగా ఉత్పన్నమయ్యే అవకాశాలను వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తాము అందిపుచ్చుకోనున్నామని వివరించారు. -
ఎల్అండ్టీ లాభం 7% ప్లస్
ముంబై: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 7% పెరిగి రూ. 862 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) క్యూ2లో రూ. 806 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. విద్యుత్, హైడ్రోకార్బన్ల విభాగం అమ్మకాలు మందగించడం లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం సుమారు 11% పుంజుకుని రూ. 21,159 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 19,130 కోట్ల ఆదాయం నమోదైంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా అమ్మకాలు మందగించాయని, అయితే వాతావరణం మెరుగుపడుతున్నదని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వృద్ధి ఆధారిత సంస్కరణల ప్రభావం కనిపించడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రూ. 39,797 కోట్ల ఆర్డర్లు సంపాదించింది. ఇది 17% అధికం. దీంతో మొత్తం ఆర్డర్‌బుక్ విలువ రూ. 2,14,429 కోట్లను తాకింది. దీనిలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 27%. ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అండ ప్రధానంగా మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), అభివృద్ధి ప్రాజెక్ట్‌లు సాధించిన పురోగతి ఆదాయాల్లో వృద్ధికి దోహదపడినట్లు రామన్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా విభాగం ఆదాయం 27% ఎగసి రూ. 9,633 కోట్లను తాకిందని, ఇందుకు భారీస్థాయిలో లభించిన ఆర్డర్‌బుక్ సహకరించిందని తెలిపారు. దీనిలో అంతర్జాతీయ వాటా 27%గా వెల్లడించారు. పలు బిజినెస్ విభాగాల్లో ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే విద్యుత్, మెటల్స్, హైడ్రోకార్బన్లు విభాగాలు నెమ్మదించాయని తెలిపారు. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్‌ల ఆదాయం రూ. 993 కోట్లుగా నమోదుకాగా, విద్యుత్ విభాగం అమ్మకాలు 20% తగ్గి రూ. 1,153 కోట్లకు పరిమితమయ్యాయి. కొత్తగా పొందిన ప్రాజెక్ట్‌లు అభివృద్ధి దశలో ఉండటమే దీనికి కారణమని రామన్ తెలిపారు. కాగా, హైడ్రోకార్బన్ల బిజినెస్ నుంచి 24% తక్కువగా రూ. 1,804 కోట్ల ఆదాయం లభించినట్లు కంపెనీ వెల్లడించింది. -
సెన్సెక్స్ రయ్ రయ్....
468 పాయింట్లు జూమ్...; 24,685 పాయింట్లకు చేరిక * ఆర్బీఐ పాలసీపై సానుకూల అంచనాల ప్రభావం * విదేశీ మార్కెట్ల పటిష్టత కూడా... * 133 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ, 7,362 పాయింట్ల వద్ద ముగింపు * ఆకర్షణీయమైన ఫలితాలతో 6.4% ఎగసిన ఎల్అండ్టీ షేరు ముంబై: మార్కెట్లలో మరోసారి ‘బుల్’ రంకేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు... మరోపక్క విదేశీ స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ సూచీలు కదంతొక్కాయి. కన్సూమర్ గూడ్స్, చమురు-గ్యాస్, విద్యుత్, మెటల్స్ రంగాల షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మెరుపులు మెరిపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 468 పాయింట్లు దూసుకెళ్లి... 24,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడచిన మూడు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద లాభం, వారం రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 133 పాయింట్ల భారీ లాభంతో 7,363 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా దూకుడే... దేశీ మార్కెట్లు సోమవారం రోజంతా లాభాలతో పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గత ముగింపు 24,217 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 24,369 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత లాభాల జోరును అంతకంతకూ కొనసాగిస్తూ... 24,709 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.83 శాతం లాభంతో పటిష్టస్థాయిలో 24,685 వద్ద స్థిరపడింది. జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగానే(2013-14లో వృద్ధిరేటు 4.7 శాతం) ఉన్న నేపథ్యంలో.. మార్కెట్లలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అయితే, చాలావరకూ బ్యాంకర్లు, నిపుణులు మాత్రం ఆర్బీఐ నేడు చేపట్టనున్న సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, మే నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ భారత్ తయారీ రంగ సూచీ(పీఎంఐ)లో పరిశ్రమలు కాస్త పుంజుకున్న సంకేతాలు కనబడటం కూడా మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసిందని బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం... వృద్ధిని తిరిగి గాడిలోపెట్టగల సమర్థ నిర్ణయాలు తీసుకోగలదన్న విశ్వాసం పెరుగుతుండటం కూడా దేశీయ మార్కెట్లో బుల్లిష్ ధోరణిని పెంచుతోందని కోటక్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ఇక చైనా తయారీ రంగం పుంజుకోవడం ఆసియా మార్కెట్లకు టానిక్‌లా పనిచేసింది. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక సెలవు కారణంగా చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లు పనిచేయలేదు. రెండు రంగాలు మినహా... బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాల సూచీల్లో స్వల్ప నష్టాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే నిలిచాయి. ప్రధానంగా కన్సూమర్ గూడ్స్ సూచీ అత్యధికంగా 4.93 శాతం ఎగబాకింది. ఇక బ్యాంకింగ్ 3.28 శాతం, చమురు-గ్యాస్ సూచీ 2.85 శాతం, విద్యుత్ సూచీ 2.38 శాతం, మెటల్స్ 1.86 శాతం, రియల్టీ 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా అంచనాలకంటే ముందే ఆర్బీఐ రేట్ల కోత ఉండొచ్చని, తాజా పాలసీలో ఈ మేరకు నిర్దిష్ట సంకేతాలు ఉంటాయన్న అభిప్రాయంతో బ్యాంకింగ్, రేట్లతో సంబంధం ఉన్న రంగాల షేర్లు పుంజుకున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ అంచనాలను మించిన ఫలితాలతో బంపర్ లాభాలను ప్రకటించడంతో కంపెనీ షేరు రివ్వున ఎగసింది. 6.23 శాతం జంప్ చేసి రూ.1,645 వద్ద స్థిరపడింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు సోమవారం నికరంగా రూ.234 కోట్ల విలువైనస్టాక్స్ను కొనుగోలు చేసినట్లు అంచనా. భారతీ ఎయిర్టెల్ 5.52%, ఓఎన్‌సీజీ 5.17%, టాటా స్టీల్ 4.42%, ఎస్బీఐ 4.23%, యాక్సిస్ బ్యాంక్ 3.59%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.26%, మారుతీ 3.06%, గెయిల్ 2.86%, హెచ్డీఎఫ్సీ 2.31%, ఇన్ఫోసిస్ 1.92%, రిలయన్స్ 1.84%, టాటా మోటార్స్ 1.58% చొప్పున ఎగబాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 స్టాక్స్‌లో 24 లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో నగదు విభాగంలో టర్నోవర్ రూ.3,619 కోట్లకు పరిమితమైంది. గత శుక్రవారం ఈ మొత్తం రూ.10,538 కోట్లు కావడం విశేషం. ఇక ఎన్ఎస్ఈ క్యాష్ విభాగంలో రూ.17,718 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. -
నిఫ్టీ 7,600 పాయింట్లకు!
ముంబై: భారత్‌పై అంతర్జాతీయ అనిశ్చితి ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టాయని.. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్న సంకేతాలు కనబడుతున్నాయని అమెరికన్ బ్రోకరేజి దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. దీంతో భారత్‌ను ‘ఓవర్‌వెయిట్’(మరింత వృద్ధికి అవకాశం) స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాదు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ ఈ ఏడాది 7,600 పాయిట్లను తాకొచ్చని కూడా అంచనా వేసింది. నిఫ్టీ తాజాగా ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. ‘ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో క్యూ2(ఏప్రిల్-జూన్), ఆ తర్వాత నుంచి వృద్ధి రేటు రికవరీ మెరుగుపడనుంది. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడం(క్యూ3లో 0.9 శాతమే), ఫారెక్స్ నిల్వల పెరుగుదల, డాలరుతో రూపాయి విలువ కొంత స్థిరపడటం వంటి సానుకూలాంశాలు ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనున్నాయి’ అని గోల్డ్‌మన్ శాక్స్ తన రీసెర్చ్ నోట్లో వెల్లడించింది. సాధారణ ఎన్నికలు దేశీ స్టాక్ మార్కెట్‌కు కీలకమైనవని, ఎన్నికల ప్రభావంతో లాభపడేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌పై దృష్టిపెట్టాలని తన క్లయింట్లకు సూచించింది. ‘ఏప్రిల్-మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల పురోగతిపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. గత ఎన్నికల సమయంలో మార్కెట్ కదలికలు, వాల్యుయేషన్(విలువ), పెట్టుబడి ప్రవాహాలను విశ్లేషిస్తే... ప్రస్తుత ఎన్నికల ముందస్తు(ప్రి ఎలక్షన్) ర్యాలీ మరింత జోరందుకోవడానికి ఆస్కారం ఉంది’ అని అభిప్రాయపడింది. ఎన్నికలతో లాభపడే స్టాక్స్‌లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ వంటివి ఉన్నాయని కూడా తెలిపింది. అయితే, ఎన్నికల ఫలితాలు అనిశ్చితికి దారితీస్తే స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోయే రిస్క్‌లు పొంచిఉన్నాయని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఐటీ, ఇంధన రంగాలపై ఓవర్‌వెయిట్ స్థాయిని కొనసాగిస్తున్నామని, ఆటోమొబైల్ రంగాన్ని కూడా ఇప్పుడు దీనిలోకి తీసుకొచ్చినట్లు బ్రోకరేజి దిగ్గజం వెల్లడించింది. బ్యాంకులు, యుటిలిటీ రంగాలను మార్కెట్ వెయిట్; హెల్త్‌కేర్, టెలికం, రియల్టీ రంగాలను అండర్‌వెయిట్ స్థాయిలో ఉంచినట్లు వివరించింది.