ఎల్‌అండ్‌టీ లాభం రూ.867 కోట్లు
10 శాతం పెరుగుదల
* గట్టెక్కించిన ఇన్‌ఫ్రా వ్యాపారం
* 17 శాతం పెరిగిన ఆర్డర్ల బుక్
ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం, లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు రూ.867 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.797 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం మెరుగుపడడం, రియల్టీ, సర్వీసెస్ వ్యాపారాల నుంచి అధిక ఆదాయం రావడంతో నికర లాభం పెరిగిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్. శంకర్ రామన్ పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.21,732 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.23,848 కోట్లకు పెరిగిందని వివరించారు. దీంట్లో అంతర్జాతీయ వ్యాపారం వాటా రూ.6,400 కోట్లని తెలిపారు.
17 శాతం పెరిగిన ఆర్డర్లు
గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆర్డర్-బుక్ 17 శాతం వృద్ధితో రూ.2,25,788 కోట్లకు చేరిందని రామన్ పేర్కొన్నారు. దీంట్లో నాలుగో వంతు అంతర్జాతీయ ఆర్డర్లేనని వివరించారు.
ఇన్‌ఫ్రా వ్యాపారం 22 శాతం వృద్ధి
ఇన్‌ఫ్రా వ్యాపారం రాబడి 22 శాతం వృద్ధితో రూ,11,553 కోట్లకు పెరిగిందని రామన్ వివరించారు. ఈ విభాగంలో రూ.24,032 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని పేర్కొన్నారు.
అవకాశాలు అందుకుంటాం..
రుణ లభ్యత, అంతర్జాతీయ పరిస్థితి సహా వివిధ ప్రభుత్వ చర్యల కారణంగా వ్యాపార పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటి ఫలితంగా ఉత్పన్నమయ్యే అవకాశాలను వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తాము అందిపుచ్చుకోనున్నామని వివరించారు.