ఈటీఎఫ్‌కు స్పందన బావుంది
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు(సీపీఎస్‌ఈ ఈటీఎఫ్) పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫండ్ కింద రూ.3,000 కోట్లకుగాను బుధవారం నాటికే రూ.1,800 కోట్లు సమీకరించడమే ఇందుకు నిదర్శనమని గోల్డ్‌మన్ శాక్స్ అసెట్ మేనేజ్‌మెంట్(ఇండియా) ఈడీ విజేష్ పేర్కొన్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన రూ.900 కోట్లలో రూ.850 కోట్లు ఇప్పటికే వచ్చాయని చెప్పారు. 2013-14లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.30 వేల కోట్లు సేకరించాలని భావించిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని సంస్థలు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లకపోవడంతో లక్ష్యాన్ని రూ.16 వేల కోట్లకు కుదించారని కేంద్ర ఆర్థిక శాఖలోని పెట్టుబడుల ఉపసంహరణ విభాగం సంయుక్త కార్యదర్శి సంగీత చౌరె తెలిపారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ కింద సమీకరించే రూ.3 వేల కోట్లు జతకూడితే లక్ష్యం పూర్తి అవుతుందని అన్నారు. సీపీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, ఐవోసీఎల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీఈఎల్, ఇంజనీర్స్ ఇండియాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ స్కీం నేటితో(మార్చి 21) ముగుస్తుంది.
ఆఫర్ నేడు ముగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్‌ఈ ఈటీఎఫ్) ఆఫర్ శుక్రవారం(21న) ముగియనుంది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేయగా, గురువారం సాయంత్రానికి రూ. 2,400 కోట్లమేర బిడ్స్ దాఖలయ్యాయి.