వాషింగ్టన్ : స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు 27 ఏళ్ల కిందట తాను అమెరికా వెళ్లే క్రమంలో తన విమాన టికెట్ కోసం తన తండ్రి ఆయన ఏడాది జీతంతో సమానమైన మొత్తం వెచ్చించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో తొలి విమాన ప్రయాణం అదేనని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు తాను ఊహించిన విధంగా లేవని అన్నారు. అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని, బ్యాగ్ కొనాలంటే భారత్‌లో తన తండ్రి నెల జీతం అంత మొత్తం వెచ్చించాల్సి ఉండేదని తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ పట్టభద్రుల్లో ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని చెప్పారు. సాంకేతిక అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కలలో కూడా ఊహించని ఆవిష్కరణలకు దారితీయవచ్చని అన్నారు. సహనంతో ముందుకు సాగితే ప్రపంచం కోరుకునే పురోగతికి అది బాటలు పరుస్తుందని చెప్పారు. చెన్నైలో పెరిగిన పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందగా, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ అభ్యసించారు. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టిన పిచాయ్ గూగుల్ టూల్‌బార్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆపై ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇంటర్‌నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment