
గూగుల్ కి ఆ డ్రైవర్లు కావాలట!
గూగుల్ సంస్థ తన డ్రైవర్‌లెస్ కార్లకై డ్రైవర్లకోసం చూస్తోంది. తాను ప్రయోగాత్మకంగా అతి త్వరగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే ఈ కార్లను మానిటర్ చేసే ఉద్యోగుల (డైవర్ల) కోసం చూస్తోంది. దీనికోసం వారికి భారీగానే జీతాలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్లను రహదారులపై ప్రయోగత్మకంగా నడిపిస్తున్న గూగుల్.. వాటికోసం 24 నెలల కాంట్రాక్టు పద్ధతిన ప్రత్యేకంగా డ్రైవర్ల నియామకం చేపట్టినట్టు అరిజోనా రిపబ్లిక్ అధికారులు తెలిపారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వాహన భద్రతా నిపుణులను రిక్రూట్ చేసుకోబోతోంది. ఇలా నియమించుకునే ఈ డ్రైవర్లకు గంటకు సుమారు 1300 రూపాయల (20 డాలర్లు) చొప్పున చెల్లించనుంది. అయితే దీనికి ఆ ఉద్యోగులు చేయాల్సిందల్లా.. రహదారులపై ఈ కార్లు ఎలా నడుస్తున్నాయి? ఇతర వాహనాలు.. మనుషులు అడ్డొచ్చినపుడు ఎలా తప్పించుకుంటున్నాయో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు నివేదిక తయారుచేయాలి. అంతేకాదు అవసరమైతే కారు మీద పూర్తి నియంత్రణను తీసుకోవాల్సి ఉంటుందని, ఆ కార్లను మాన్యువల్‌గా కూడా నడపాల్సి ఉంటుందని తెలిపింది. వివరణాత్మక, ఖచ్చితమైన నివేదికను అందించాలని కోరింది.
రోజుకు 6 నుంచి 8 గంటల చొప్పున.. వారానికి ఐదు రోజులు పనిచేయాల్సి ఉంటుంది. 12 నుంచి 24 నెలల ఒప్పందంతో ఈ డ్రైవర్లను గూగుల్ నియమించుకోనుంది. అందుకోసం దరఖాస్తు చేసుకునే వారికి క్లీన్ డ్రైవింగ్ రికార్డుతో పాటు.. ఎలాంటి క్రిమినల్ రికార్డులు ఉండకూడదు. కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అన్నట్టు ఈ డ్రైవర్లకు టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ నిమిషానికి కనీసం 40 పదాలు ఉండాలట. ప్రస్తుతం 23 లెక్సస్ సెల్స్ డ్రైవింగ్ కార్లు, 34 గండ్రాప్ కార్ల ద్వారా ఒక వారంలో 10,000 నుంచి 15,000 మైళ్ళ డ్రైవింగ్ తో మొత్తం 1.6 మిలియన్ మైళ్ళదూరాన్ని కవర్ చేస్తోంది.