ఇరుగు పొరుగు సమాచారం, సందేహాలకు ఎక్కడికక్కడే పరిష్కారం లభించే రీతిలో ఓ కొత్త యాప్ వచ్చేసింది. ఇప్పటికే ముంబైలో ప్రవేశించిన ఈ యాప్ త్వరలోనే దేశంలోని అన్ని నగరాలకు విస్తరించబోతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల పోటీలో కాస్త వెనుకబడిన గూగుల్ ఇప్పుడీ కొత్త యాప్‌తో వివిధ ప్రాంతాల్లో నివసించేవారిని ఇరుగుపొరుగును అనుసంధానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. రెండేళ్ల పరిశోధన,సర్వేల ద్వారా రూపొందించిన ఈ యాప్ పేరు ‘నైబర్లీ’. దాని ద్వారా తమ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఎప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే ఈ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందే ఛాటింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది. జీపీఎస్ ద్వారా యూజర్ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకుని సమీపంలోనే ఉన్న అవసరమైన సమాచారం అందుబాటులోకి తెస్తుంది. వంటింటి సామాగ్రి నుంచి దుకాణాలు, ఆసుపత్రులు వంటి అన్ని రకాల సమాచారానికి పరిసర ప్రాంతాల్లోనే పొందే సౌలబ్యం కల్పిస్తుంది.
ఇటీవల ముంబైలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏ విధంగా ఆదుకోవాలో చెప్పాలంటూ ఓ లోకల్‌రైలు ప్రయాణీకుడు తన స్మార్ట్‌ఫోన్లో అడిగిన వెంటనే వచ్చే స్టేషన్లో స్టేషన్‌మాస్టర్‌ను కలవాలని, ప్రథమ చికిత్స కోసం టికెట్‌కలెక్టర్‌ను అడగాలని, అత్యవసర సహాయం కోసం 138కు ఫోన్ చేయాలంటూ వెంటనే రకరకాల సలహాలు వచ్చేశాయి. గూగుల్ సెర్చ్ ఆప్షన్, డిజిటల్ అసిస్టెంట్, వాయిస్ బేస్డ్ సెర్చ్‌లకు ఆదరణ పెరగడంతో ఈ యాప్ ద్వారా తమ ప్రాంతీయభాషల్లో ప్రశ్నలు కూడా అడిగే సౌలభ్యముంది. ఫలానా వస్తువు ఎక్కడ లభిస్తుంది ? ఫలానా సాంకేతిక సమస్య ఎవరు సమర్థంగా పరిష్కరిస్తారు ? ఫలానా వస్తువు కోసం ఏమి తీసుకోమంటారు వంటివి యాప్‌లోనే టైప్ చేసి సిద్ధంగా ఉంచడం వల్ల వెంటనే వాటిని ఎంచుకుని పంపించే ఏర్పాటుంది.
ఏమిటీ యాప్...?
ఏదైన సమస్యపై లేదా అవసరమైన సమాచారంపై బృంద చర్చల్లో పాల్గొనకుండానే యూజర్లకు సూటిగా సమాధానమిచ్చేందుకు ‘నైబర్లీ’ (పొరుగు) యాప్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది. దీని యూజర్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండానే బ్రౌజ్ చేయడంతో పాటు ప్రశ్నలు వేయొచ్చు లేదా సమాధానాలు ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో వినియోగదారుల ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. వారి పూర్తిపేరు, ఫోన్‌నెంబర్, ఇతర సమాచారం రహస్యంగా ఉంచుతారు.
మిగతా యాప్‌లలో మాదిరిగా యూజర్ ప్రొఫైల్ ఫోటోను పెద్దది చేయడం, స్టోర్ చేసుకునే వీలుండదు. దీనిని ఉపయోగించడం మొదలుపెట్టినపుడు చుట్టుపక్కల వారి భద్రతకు కట్టుబడి ఉంటామని, సంబంధంలేని విషయాలు లేదా స్పామ్ మెసేజ్‌లు పెట్టమని ప్రతీ ఒక్కరూ వాగ్దానం చేయాల్సి ఉంటుంది.ఇది కేవలం 7 ఎంబీల కంటే తక్కువ సైజులో ఉండడంతో పాత లేదా ధర తక్కువ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉపయోగించే వీలు ఏర్పడింది. మనదేశంలో దాదాపు 50 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నందున సోషల్ నెట్‌వర్కింగ్, సెర్చ్, పేమెంట్స్‌లకు (వివిధ సేవలకు ఫోన్ ద్వారా చెల్లింపులు) ఒకే గమ్యస్థానంగా ఈ యాప్ నిలుస్తుందనే ఆశాభావంతో గూగుల్ ఇండియా సంస్థ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment