Twitter Vs Threads: Know What Are The Key Differences And Why Youth Showing Interest On Threads App - Sakshi
Sakshi News home page

Twitter Vs Threads Differences: ఎలన్‌ మస్క్‌ పెట్టిన పనికిమాలిన రూల్స్‌ వల్లే థ్రెడ్స్‌కి డిమాండ్‌ పెరిగిందా?

Published Wed, Jul 12 2023 11:17 AM | Last Updated on Wed, Jul 12 2023 12:00 PM

Twitter vs Threads: What Are The Key Differences? - Sakshi

మెటా వారి ‘థ్రెడ్స్‌’  ట్విట్టర్‌–కిల్లర్‌ అవుతుందా లేదా అనేది తెలియదుగానీ ఈ యాప్‌పై యువత అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ట్విట్టర్‌ కంటే ‘థ్రెడ్స్‌’ ఏ రకంగా భిన్నమైనది అనే విశ్లేషణ ఒక కోణం అయితే, కొత్తవాటిపై సహజమైన ఆసక్తి మరో కోణం...

మెటా వారి టెక్ట్స్‌ ఆధారిత సంభాషణ యాప్‌ ‘థ్రెడ్స్‌’ ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. యాప్‌ మొదలైన రెండు గంటలోనే ఇరవై లక్షల మంది యూజర్‌లు సైనప్‌ అయ్యారు. నాలుగు గంటలలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరడం చూస్తుంటే థ్రెడ్స్‌ ‘ట్విట్టర్‌’కు గట్టిపోటీ ఇవ్వనుందనే విషయం అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘థ్రెడ్స్‌’ డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా యూరప్‌లో అందుబాటులోకి రాలేదు. థ్రెడ్స్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌లు తమ యూజర్‌ నేమ్‌ కొనసాగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని రెడీ–మేడ్‌ యూజర్‌ బేస్‌ వల్ల ‘థ్రెడ్స్‌’ ట్విట్టర్‌ని మించిపోతుంది అనే అంచనా ఉంది.


‘థ్రెడ్స్‌పై యూత్‌ ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏమిటి?’

ఈ ప్రశ్నకు దేశంలోని వివిధ నగరాలకు చెందిన యువగళాల మాటల్లోనే జవాబు దొరుకుతుంది.
► ట్విట్టర్‌ ఎలాన్‌ మస్క్‌ అధీనంలోకి వచ్చిన తరువాత ప్రయోజనకరమైన మార్పుల కంటే అవసరం లేని మార్పులే ఎక్కువ జరిగాయి. యూజర్‌ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్‌ పై కొత్త రూల్స్‌... మొదలైనవి చిరాకు తెప్పించాయి’ అంటుంది ముంబైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్‌ మనీష.
► థ్రెడ్స్‌ అనేది ట్విట్టర్‌కు కాపీ–పేస్ట్‌’ అనే విమర్శ మాట ఎలా ఉన్నా ‘ట్విట్టర్‌తో పోల్చితే భిన్నంగా ఉంది’ అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ‘జుకర్‌ బర్గ్‌ కాపీ–పేస్ట్‌ విధానాన్ని నమ్ముకొని బాహుబలి లాంటి ట్విట్టర్‌ను ఢీ కొనడానికి రంగంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ట్విట్టర్‌తో పోల్చితే థ్రెడ్స్‌ కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో పోస్ట్‌ చేసే వీడియోల నిడివి అయిదు నిమిషాలు. ట్విట్టర్‌లో అయితే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు. థ్రెడ్స్‌లో పోస్ట్‌ పరిమితి అయిదు వందలు. ట్విట్టర్‌లో రెండు వందల ఎనభై. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగవచ్చు’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ చైత్ర.



► ‘థ్రెడ్స్‌’లోని వినూత్నమైన ఫీచర్‌ ‘ఫెడివర్స్‌’ యూత్‌కు నచ్చింది. ఆల్టర్‌నేటివ్‌ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘మాస్టడన్‌’లాంటి వాటితో ‘థ్రెడ్స్‌’ యూజర్‌లు ఇంటరాక్ట్‌ కావచ్చు. ఎప్పటికప్పుడు ప్లాట్‌ఫామ్‌ మైగ్రేషన్‌లో యూత్‌ చురుగ్గా ఉంటుంది.
► యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో బౌండర్‌’కు చెందిన ప్రొఫెసర్‌ కేసీ ఫైస్లర్‌ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని లోతుగా అధ్యయనం చేసిన ‘ఇన్‌ఫర్‌మేషన్‌ సైంటిస్ట్‌’గా పేరు తెచ్చుకుంది. ప్లాట్‌ఫామ్‌ మైగ్రేషన్స్‌’ గురించి రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ చేసింది.

► ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు మార్చారు? మార్చడం ద్వారా ఎదురైన సవాళ్లు, అనుభవాలు’ అనే అంశంపై యువతరంలో ఎంతోమందితో మాట్లాడింది.
► ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందులోని ఆన్‌లైన్‌ కమ్యూనిటీ తట్టాబుట్టా సర్దుకొని కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి వెళుతుంది. మైగ్రేషన్‌కు సంబంధించి తొలి దశలో కొత్త ప్లాట్‌ఫామ్‌ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందరి కంటే ముందు తామే ఉండాలనుకునేవారితోపాటు, స్నేహితులు కదిలేవరకు కదలని వారు కూడా ఉంటారు’ అంటుంది ఫైస్లర్‌.



► ట్విట్టర్‌తో పోల్చితే హ్యాష్‌ట్యాగ్స్, వెబ్‌ వెర్షన్, ఎడిట్‌ పోస్ట్‌లు, డీఎం ఆప్షన్, ఎఐ జనరేటెడ్‌ ఆల్ట్‌ టెక్ట్స్, ట్రెండింగ్‌ టాపిక్స్, క్రోనలాజికల్‌ ఫీడ్‌... మొదలైన ఫీచర్స్‌ ‘థ్రెడ్స్‌’లో లేవు అనే మాట వినిపిస్తోంది.

ఎన్నో అంచనాలతో ‘థ్రెడ్స్‌’లోకి వచ్చిన నవతరాన్ని మెటా నిరుత్సాహ పరుస్తుందా? ఒక మీమ్‌లో చూపినట్లు వేగంగా వచ్చిన వాళ్లు అంతే వేగంగా వెళ్లిపోతారా?  ‘థ్రెడ్స్‌ ద్వారా జుకర్‌బర్గ్‌ కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు’ అనే ఆశావాదంతో ఎంతకాలమైనా ఎదురుచూసే వాళ్లు ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది.

ట్విట్టర్ vs థ్రెడ్స్ ఈ మీమ్స్ చూస్తే పొట్టచక్కలు
ట్విట్టర్‌ వర్సెస్‌ థ్రెడ్స్‌ నేపథ్యంలో యువ నెటిజనులు మీమ్స్, జోక్స్‌ పేలుస్తున్నారు. ‘ఎట్‌ ది రేట్‌ ఆఫ్‌’ సింబల్‌ని పోలిన ‘థ్రెడ్స్‌’ లోగో అచ్చం జిలేబిలా ఉందని కొందరు రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్ట్‌ చేస్తున్నారు. ఒక మీమ్‌లో... ట్విట్టర్‌ ఆఫీస్‌ కిటికీ నుంచి మార్క్‌ జుకర్‌బర్గ్‌ దొంగచాటుగా తొంగి చూస్తుంటాడు.

‘థ్రెడ్స్‌లోకి వెళ్లిన వారు కేవలం 5 నిమిషాల తరువాత బ్యాక్‌ టు ట్విట్టర్‌ అంటూ ఎలా పరుగెత్తుకు వస్తున్నారో చూడండి’ అంటూ ట్విట్టర్‌ వీరాభిమానులు వీడియో క్లిప్‌ పోస్ట్‌ చేశారు. నసీబ్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్, సూర్యవంశ్‌... మొదలైన బాలీవుడ్‌ సినిమాల క్లిప్‌లకు ట్విటర్‌–థ్రెడ్స్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్‌ జత చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement