న్యూఢిల్లీ: నీతిఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ప్రభుత్వరంగంలో ఎస్‌బీఐ మినహా మిగిలిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలని గట్టిగా సూచించారు. 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న అన్ని పార్టీలు ఈ అంశాన్ని ముందుగానే తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రస్తుతం పనగరియా ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు కుంభకోణాలు, మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోవడం అన్న ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి పీఎన్‌బీ రూ.13,000 కోట్ల కుంభకోణం నేపథ్యంలో పనగరియా ఇలా స్పందించారు. భారీ స్థాయిలో డిపాజిట్లు ఉండి కూడా సమర్థతలేమితో మార్కెట్ విలువను కోల్పోతున్నందున ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రం తనకున్న వాటాను వదిలిపెట్టుకోవాలని పనగరియా సూచించారు.
రుణ అవసరాలను తీర్చే సామాజిక లక్ష్యాల కోసం ప్రభుత్వరంగంలో రెండు డజన్ల బ్యాంకులు ఉండాలని వాదించడం అసమంజసంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రాధాన్య రంగాలకు రుణాలందిస్తూనే మెరుగ్గా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
వాణిజ్య విధానాన్ని సరళించడమే మార్గం
ఇటీవలి వాణిజ్య ఘర్షణలు, భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడడంపై పనగరియా స్పందిస్తూ... భారత సరుకులకు అమెరికా ద్వారాలు మూయకముందే భారత్ తన వాణిజ్య విధానాన్ని మరింత స్వేచ్ఛాయుతంగా మార్చేందుకు వెనుకాడరాదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment