బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు రెడీ! | Government mulls ordinance to up Insurance FDI cap | Sakshi
Sakshi News home page

బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు రెడీ!

Published Wed, Dec 24 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు రెడీ!

బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు రెడీ!

ప్రభుత్వం సంకేతాలు...
నేడు కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై చర్చ!
విపక్షాల ఆందోళనలతో బిల్లులను ప్రవేశపెట్టలేకపోవడమే కారణం..

 
న్యూఢిల్లీ: బీమా ఎఫ్‌డీఐలు, బొగ్గు రంగంలో సంస్కరణలను ఎలాగైనా అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రాజ్యసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం లభించకపోవడం... పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్‌ల ద్వారా ముందుకెళ్లాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.

ఈ రెండు సంస్కరణలను అమలు చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చే ప్రతిపాదనలపై అతి త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాధ్యమైనంతవరకూ బుధవారం(నేడు) ఈ సమావేశం జరిపే అవకాశాలున్నాయని కూడా ఆయా వర్గాల సమాచారం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు విషయంలో అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూరుస్తోంది.

‘బీమా కంపెనీలకు విదేశీ దిగ్గజాల అనుభవం, నైపుణ్యాలు చాలా అవసరం. దేశ ప్రజలందరికీ బీమా ఉత్పత్తులు, సేవలను విస్తరించాలంటే భారీస్థాయిలో పెట్టుబడులు కూడా కావాలి. అందుకే ఈ బిల్లు విషయంలో సాధ్యమైనంతవరకూ విభిన్న ప్రత్యామ్నాలన్నింటినీ అన్వేషించాల్సిన అవసరం ఉంది’ అని సిన్హా పేర్కొన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

సభలో ప్రతిష్టంభన...
దేశీ బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా చట్టాల సవరణ బిల్లు-2008కి పార్లమెంట్ సెలక్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు, ఎఫ్‌డీఐలు కలిసి మొత్తం పరిమితి(కాంపోజిట్ లిమిట్) 49 శాతానికి మించకూడదన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది.

దీంతో కేబినెట్ కూడా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అయితే, మత మార్పిడులు, ఇతరత్రా అంశాలపై రాజ్యసభలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఈ బిల్లును మోదీ సర్కారు ప్రవేశపెట్టలేకపోయింది. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. ఎగువ సభలో తగిన మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు పాస్ కావాలంటే విపక్షాల మద్దతు తప్పనిసరి.

ఇదిలాఉంటే.. బొగ్గు గనుల వేలం, పునఃకేటాయింపులకు సంబంధించిన బొగ్గు గనుల(ప్రత్యేక మార్గదర్శకాలు) బిల్లు-2014కు లోక్‌సభలో ఆమోదముద్ర లభించినప్పటికీ.. రాజ్య సభలో ప్రవేశ పెట్టడం కుదరలేదు. దీనికి కూడా సభలో నెలకొన్న ప్రతిష్టంభనే కారణం. ప్రతిపక్షాలు సృష్టించిన రాజకీయపరమైన దుమారమే రాజ్య సభ సమావేశాల్లో కీలక బిల్లులకు గండికొట్టాయని సిన్హా దుయ్యబట్టారు.

బొగ్గు స్కామ్ నేపథ్యంలో 1993 నుంచి 2010 వరకూ జరిపిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీం కోర్టు తన తీర్పులో రద్దు చేయడం తెలిసిందే. దీంతో కేంద్రం వీటికి మళ్లీ వేలం వేయడం కోసం ఈ బొగ్గు బిల్లును రూపొందించింది. కాగా, వేలం ముసాయిదా నిబంధనల రూపకల్పనతోపాటు వీటిని కేంద్రం ఇప్పటికే ఖరారు కూడా చేసింది. వచ్చే ఫిబ్రవరిలో వేలానికి కూడా ప్రభత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది.

అయితే, దీనికి పార్లమెంటులో బొగ్గు బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారానైనా వేలానికి ఆటంకం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... బీమా, బొగ్గు సంస్కరణల విషయంలో వెనకడుగు వేయబోమని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement