
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సేవల సంస్థ పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి బిడ్ వచ్చినట్టు ఓ సీనియర్ అధికారి తెలియజేశారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పవన్‌హన్స్‌లో కేంద్రానికి 51 శాతం వాటా, ఓఎన్‌జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 6వరకు సమయం ఇచ్చారు.
ప్రభుత్వం, ఓఎన్‌జీసీ కలసి నూరు శాతం వాటాను విక్రయించే యోచనతో ఉన్నాయి. ‘‘ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి ఫైనాన్షియల్ బిడ్ వచ్చిందని ఈ లావాదేవీ వ్యవహారాలు చూసే (ట్రాన్సాక్షన్ అడ్వైజర్) సంస్థ మాకు సమాచారమిచ్చింది. ఈ బిడ్ విషయంలో ముందుకు వెళ్లాలా? లేక తిరిగి ఈ ప్రక్రియను మొదట నుంచి ఆరంభించాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది’’ అని ఆ అధికారి వెల్లడించారు. మే 23న ఫలితాల వెల్లడితో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్న విషయం తెలిసిందే.