విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హెల్ప్ డెస్క్లు..
విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్
న్యూయార్క్: దేశీ విద్యుత్ రంగంలోకి దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారత చట్టాలు, నిబంధనలు తదితర అంశాల మీద ఇన్వెస్టర్లకు తోడ్పాటు అందించే విధంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లోనూ వీటిని ప్రారంభించనున్నట్లు అమెరికా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు.
ఇన్వెస్టర్లు ప్రధానంగా విద్యుత్ పంపిణీ కంపెనీల స్థితిగతులు, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల నిబంధనల గురించి సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 5-6 ఏళ్లలో భారత విద్యుత్ రంగంలో 250 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు ఉన్నాయని, 2030 నాటికి ఏకంగా 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం కాగలవని గోయల్ వివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా బ్లాక్‌స్టోన్, వార్‌బర్గ్ పింకస్ వంటి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలతో గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.