600 మెగావాట్ల విద్యుత్ ఇవ్వండి
Published Thu, Oct 23 2014 1:03 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
సీఎం కేసీఆర్ తరఫున కేంద్రమంత్రి గోయల్‌కు వేణుగోపాలాచారి లేఖ
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిలో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణకు తక్షణం 600 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరఫున ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌కు బుధవారం లేఖ రాశారు. ఎవరికీ కేటాయించని (అన్ అలొకేటెడ్) కోటా కింద 600 మెగావాట్ల విద్యుత్‌ను ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదనపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, గోయల్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శులకు రాసిన లేఖల్లో వివరణ ఇచ్చారు.
అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘‘శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కోరుతూ రెండ్రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు లేఖ రాసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఖండిస్తున్నాం. జీవోలు, నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నట్టు రివర్ బోర్డుకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నాం’’ అని చెప్పారు. ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించకుండా కృష్ణా రివర్ బోర్డుకు సూచించాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు.
Advertisement