తెలంగాణలో భారీ విద్యుత్ ప్రాజెక్టు
4,000 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో 4,000 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు అంశాన్ని లేవనెత్తారు.
తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో హామీ ఇచ్చారని, అయితే బడ్జెట్‌లో ఆ ప్రస్తావనేదీ లేదని ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు, నీటి సదుపాయం, భూములు కూడా ఉన్నాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ బదులిస్తూ తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం బిడ్డింగ్‌లపై సమీక్ష జరుగుతోందని, ఆ తర్వాత కోల్‌బ్లాక్‌ల గుర్తింపు, ఇతర లాంఛనాలు పూర్తయ్యాక ప్రాజెక్టు ఏర్పాటు వేగవంతమవుతుందని చెప్పారు.