న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్ చేయటంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి రూ.4,242 కోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం (ఐటీ) ఇన్ఫోసిస్‌ను ఎంపికచేసింది. ప్రాజెక్టు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుంది. మూడు నెలలు ప్రాజెక్టు పరీక్షా సమయం. అటు తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం విలేకరులకు పియూష్ గోయెల్ తెలిపిన వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
► ప్రస్తుతం రిటర్న్‌లు ఫైల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ సమయం 63 రోజులు పడుతోంది. తాజా వ్యవస్థ అమలోకి వచ్చిన తర్వాత ఈ సమయం కేవలం 24 గంటలకు తగ్గిపోతుంది. దీనితో రిఫండ్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది.
► కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఆదాయపు పన్ను శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు రూపకల్పనకు బిడ్డింగ్ ప్రాసెస్‌లో ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేశారు.
► ప్రస్తుతం ఉన్న వ్యవస్థ విజయవంతమైనదే అయినప్పటికీ, తాజా వ్యవస్థ మరింత ట్యాక్స్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకతనూ పెంపొందిస్తుంది. అన్ని స్థాయిల్లోనూ ఆటోమేషన్ సౌలభ్యం ఏర్పడుతుంది.
► ఆదాయపు పన్ను శాఖ ప్రమేయం ఏమాత్రం లేకుండా పన్ను చెల్లింపుదారుల అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా రిఫండ్స్ జారీ అవుతాయి.
► ప్రస్తుత సీపీసీ–ఐటీఆర్ 1.0 ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికిక్యాబినెట్ మరో రూ.1,482 కోట్లను మంజూరు చేసింది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి.
నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు
అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్ల కేటాయించింది. ఈశాన్య భారత ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది. ఏడాదికి ప్రస్తుతం 3 మి. టన్నుల క్రూడ్ రిఫైన్ చేస్తోంది. ఈ సామర్థాన్ని 6 మి. టన్నులకు పెంచడం క్యాబినెట్ ప్రస్తుత నిర్ణయ ఉద్దేశమని పియూష్ గోయెల్ తెలిపారు. 48 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కింద పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్‌కు క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్‌లైన్ ఏర్పాటవుతుంది.
ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.6,000 కోట్లు
ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్‌పోర్ట్– ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్యకలాపాల విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యాంకుకు తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రీక్యాపిటలైజేషన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులకు జారీ అయ్యే తరహాలోనే ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లు జారీ అవుతాయి. ప్రస్తుత (రూ.4,500 కోట్లు), వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో (రూ.1,500 కోట్లు) బ్యాంకుకు రెండు విడతల్లో బ్యాంకుకు తాజా మూలధనం అందుతుంది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు.
రిటర్న్‌ల ప్రాసెసింగ్ ఒక్క రోజులో..!
Published Thu, Jan 17 2019 5:06 AM | Last Updated on Thu, Jan 17 2019 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment