న్యూఢిల్లీ: ఇటీవలి సంస్కరణలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ సర్దుకుంటున్న నేపథ్యంలో ఆన్‌లైన్ నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్‌లో ఆన్‌లైన్ హైరింగ్ 11 శాతం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తి, తయారీ రంగాల్లో ఇది అత్యధిక స్థాయిలో ఉంది. ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సేవల సంస్థ ‘మాన్‌స్టర్‌డాట్‌కామ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఉద్యోగాల కల్పనకు సంబంధించి సంస్థ నిర్వహించే మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ సూచీ గతేడాది ఏప్రిల్‌లో 268 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధితో 298కి చేరింది. సూచీలోని మొత్తం 27 పరిశ్రమల్లో గతేడాదితో పోలిస్తే 21 రంగాల్లో ఆన్‌లైన్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉత్పత్తి, తయారీ రంగాల్లో అత్యధికంగా 54 శాతం మేర దీర్ఘకాలిక వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో నమోదైన 47 శాతంతో పోలిస్తే మరో ఏడు పాయింట్లు పెరిగింది.
ఇక గృహోపకరణాల రంగం 45 శాతం వార్షిక వృద్ధితో రెండో స్థానంలో నిల్చింది. హెల్త్‌కేర్, ఫైనాన్స్.. అండ్ అకౌంట్స్ మొదలైన విభాగాల్లో నియామకాలు మెరుగుపడ్డాయి. ఇటీవలి సంస్కరణలకు ఎకానమీ సానుకూల ధోరణిలో సర్దుకుంటోందని, ఆన్‌లైన్ హైరింగ్ మెరుగవుతోందని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఏపీఏసీ, గల్ఫ్) సీఈవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు.
పీఎస్‌యూల్లో తగ్గుదల..
పరిశ్రమలన్నింటిలోనూ అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ), రక్షణ రంగంలో రిక్రూట్‌మెంట్ 34 శాతం మేర క్షీణించింది. ఇక బీపీవో/ఐటీఈఎస్ రంగంలోనూ అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే, క్షీణతకు మాత్రం కొంత అడ్డుకట్టపడింది. ఆన్‌లైన్ నియామకాల పెరుగుదల 24 శాతం మేర క్షీణించగా, ఏప్రిల్‌లో 16 శాతానికి పరిమితమైంది.
టెలికం రంగంలో విలీనాలు, కొనుగోళ్లతో నియామకాల విషయంలో కొంత ఆచి తూచి వ్యవహరించే పరిస్థితి నెలకొందని ముఖర్జీ పేర్కొన్నారు. కంపెనీలు ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఉద్యోగులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుకోవాల్సి ఉండగా, ఉద్యోగార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ముంబైలో 15 శాతం అప్..
ఆన్‌లైన్ నియామకాల్లో నగరాలవారీగా చూస్తే ప్రధమ శ్రేణి నగరాల్లో ముంబై ఒక్కటే రెండంకెల స్థాయిలో 15 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్చితో పోలిస్తే ఒక్క శాతం అధికంగా హైదరాబాద్‌లో 9 శాతం వృద్ధి నమోదైంది. అటు చెన్నైలో రెండు శాతం పెరిగి 9 శాతానికి చేరింది. జైపూర్‌లో అత్యధికంగా 28 శాతం, చండీగఢ్.. కొచ్చిలో 24 శాతం వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment