పతనానికి ప్రధాన కారణాలు...
- ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి) ఆరేళ్ల కనిష్టం, 5 శాతానికి పడిపోయింది. గత క్యూ1లో జీడీపీ 8 శాతంగా, అంతకుముందు క్వార్టర్‌లో 5.8 శాతంగా నమోదైంది. జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం...పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పతనమయ్యాయి అనడానికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు.
- తయారీ రంగం తీసికట్టు
గత నెలలో తయారీ రంగం వృద్ధి 15 నెలల కనిష్టానికి, 51.4కు (ఈ ఏడాది జూలైలో ఇది 52.5) పడిపోయింది. అమ్మకాల వృద్ధి మందగమనంగా ఉండటం, ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కూడా అంతంతమాత్రంగానే ఉండటం దీనికి ప్రధాన కారణాలు. మరోవైపు గత ఏడాది జూలైలో 7.3 శాతంగా ఉన్న ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి ఈ ఏడాది జూలైలో 2.1 శాతానికి తగ్గింది.
- జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయ్...
ఈ ఏడాది జూలైలో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు గత నెలలో రూ.98,202 కోట్లకు తగ్గాయి. దీంతో ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొన్నది.
- రూపాయి భారీ పతనం
డాలర్‌తో రూపాయి మారకం విలువ 97 పైసలు పతనమై 72.39 వద్ద ముగిసింది. డాలర్ పుంజుకుంటుండటంతో రూపాయి బలహీనపడుతోంది.
- భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ఈ ఏడాది ఆగస్టులో వివిధ వాహన కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల రేంజ్‌లో(11–60 శాతం) తగ్గాయి. దేశీయంగా ప్రయాణికుల వాహన అమ్మకాలు 31% పడిపోయాయి. వాహన విక్రయాలు తగ్గడం ఇది వరుసగా పదో నెల. దీంతో వాహన షేర్లు 3.5% వరకూ నష్టపోయాయి. టాటా మోటార్స్ 3.5%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.5%, మారుతీ 1.1%, బజాజ్ ఆటో 1 శాతం, హీరో మోటొకార్ప్ 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి.
- తగ్గని వాణిజ్య ఉద్రిక్తతలు
అమెరికా–చైనాల మధ్య చెలరేగిన వాణిజ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వాణిజ్య ఉద్రిక్తత నివారణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా, ఎలాంటి పురోగతి ఉండటం లేదు. చర్చలు జరగడానికి ఆశావహ వాతావరణం నెలకొందని ఇరు దేశాలు సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈ నెల 1 నుంచి ఇరు దేశాలు విధించిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇరు దేశాల మంకుపట్టుతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.
- ఆగని విదేశీ విక్రయాలు...
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. సూపర్ రిచ్ సర్‌చార్జీ తొలగించినప్పటికీ, ఎఫ్‌పీఐలు గత నెలలో రూ.17,592 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
నిరుత్సాహకరమైన ఆర్థిక రంగ గణాంకాలు... ఆర్థిక వ్యవస్థ దుస్థితికి అద్దంపట్టంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, కీలక రంగాల వృద్ధి బలహీనంగా ఉండటం, ఆగస్టు నెల వాహన విక్రయాలు పేలవంగా ఉండటం.. ఇవన్నీ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోందనడానికి సంకేతాలంటూ ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. ఆర్థిక రంగానికి సంబంధించి దేశీయంగా నెలకొన్న ఆందోళనకు, చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఉద్దేశించిన చర్చలపై అనిశ్చితి నెలకొనడం వంటి బలహీన అంతర్జాతీయ సంకేతాలు కూడా తీవ్రంగానే ప్రభావం చూపించాయి. మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను గట్టెక్కించడానికి ఆర్థిక మంత్రి పఠించిన విలీన మంత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ముడి చమురు ధరలు 1% పతనమైనా, మార్కెట్ పతనం ఆగలేదు. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
మెరుగుపడని మార్కెట్ సెంటిమెంట్...
ఇంట్రాడేలో 867 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 770 పాయింట్లు పతనమై 36,563 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 225 పాయింట్లు క్షీణించి 10,798 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం మేర నష్టపోయాయి. ఇంట్రాడే పతనం పరంగా చూస్తే, గత 11 నెలల్లో మార్కెట్‌కు ఇదే అత్యంత అధిక పతనం. వినాయక చవితి కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ పనిచేయలేదు. ఒక రోజు సెలవు తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఆరంభంలోనే భారీ నష్టాలకు గురైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 867 పాయింట్లు, నిప్‌టీ 246 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఆర్థిక వ్యవస్థలో జోష్‌ను నింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మార్కెట్ సెంటిమెంట్ మాత్రం మెరుగుపడటం లేదు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
మరిన్ని విశేషాలు...
- 31 సెన్సెక్స్ షేర్లలో రెండు షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా, మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. రూపాయి భారీ పతనం కారణంగా టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి.
- దాదాపు 250కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఓకార్డ్, కెనరా బ్యాంక్, కేఎస్‌బీ పంప్స్, ఓమాక్సీ, జ్యోతి ల్యాబ్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.
- స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, ఐడీబీఐ బ్యాంక్ షేర్ మాత్రం 7.6%లాభంతో రూ.28.80కు ఎగసింది. ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి ఈ బ్యాంక్‌కు రూ.9,300 కోట్ల మూలధనం సమకూరుస్తుండటమే దీనికి కారణం.
- స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ షేర్ ఆల్ టైమ్ హై, రూ.2,697ను తాకింది. చివరకు 3.5 శాతం లాభంతో రూ.2,650 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇండిగో, బాటా ఇండియా, అబాట్ ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.
రూ.2.55 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.2.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,55,586 కోట్లు తగ్గి రూ.1,38,42,866 కోట్లకు పడిపోయింది.
అప్పటివరకూ అప్రమత్తంగానే ఉండాలి...
బలహీనమైన దేశీయ సెంటిమెంట్, అనిశ్చితిగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే సంకేతాలు కనిపించేదాకా ఇన్వెస్టర్లు అప్రమత్తంగానే వ్యవహరించాలి.
–అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment