కొలువులకు బుల్ కళ!
మళ్లీ జోరుగా నియామకాలు
- రిటైల్ బ్రోకింగ్ సంస్థల భారీ హైరింగ్ ప్రణాళికలు
- పెద్దయెత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో బుల్ ర్యాలీ ఇటు జాబ్ మార్కెట్లోనూ ఉత్సాహం నింపుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుండటంతో.. బ్రోకింగ్ సంస్థల వ్యాపారం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో, కస్టమర్లకు సర్వీసులు అందించడం కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి. జోరుగా రిక్రూట్‌మెంట్ ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఫలితంగా రాబోయే కొన్ని నెలల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగావకాశాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్ల ఊగిసలాట కారణంగా కొద్దిరోజుల క్రితం దాకా బ్రోకింగ్ సంస్థలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి.
గడ్డు పరిస్థితుల నుంచి బైటపడేందుకు వ్యయాలను భారీగా తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 1 లక్ష మంది పైగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లు కళకళ్లాడుతుండటంతో బ్రోకింగ్ సంస్థలు హైరింగ్ యోచనల్లో ఉన్నాయి. క్యాష్ సెగ్మెంట్‌లో మొత్తం 9,500 బ్రోకింగ్ సంస్థలు ఉండగా.. ఇందులో సింహభాగం సంస్థలు కొత్త కస్టమర్లను దక్కించుకోవడం, వారికి సర్వీసులు అందించేందుకు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుం డటంతో ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థలు బులిష్‌గా ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 3,200 మంది ఉద్యోగులు ఉన్నారని, దశలవారీగా ఈ సంఖ్యను మరో 10 శాతం మేర పెంచుకునే అవకాశం ఉందని షేర్‌ఖాన్ మానవ వనరుల విభాగం హెడ్ ఉల్హాస్ పగీ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడంతో.. క్లయింట్ల లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. కొత్త అకౌంట్ల కోసం దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయన్నారు.
ఆశావహంగా భవిష్యత్..: గడ్డుకాలంలో కూడా భవిష్యత్‌పై ఆశావహ అంచనాలతో అన్ని సన్నాహాలూ చేసుకున్నామని ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ ఆనంద్ రాఠీ తెలిపారు. తాము ఊహించినదే ప్రస్తుతం జరుగుతోందని, రిటైల్ సెగ్మెంట్ కూడా కళకళ్లాడుతోందని ఆయన వివరించారు. ట్రేడింగ్ పరిమాణాలు పెరుగుతుండటంతో భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనంద్ రాఠీ సంస్థలో ప్రస్తుతం 2,500 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు.
మరోవైపు, మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తమ బ్రోకింగ్ వ్యాపార విభాగం కోసం గత ఏడాది వ్యవధిలో 200 మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ సంస్థకు 8 లక్షల క్లయింట్లు ఉండగా. అందులో సుమారు ఏడు లక్షల పైచిలు రిటైల్ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ క్లయింట్లు ఉన్నారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, రిటైల్ కస్టమర్లకు మళ్లీ మార్కెట్లపై విశ్వాసం వస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓస్వాల్ తెలిపారు.
విస్తరణపై దృష్టి..
గడచిన రెండు నెలలుగా కోటక్ సెక్యూరిటీస్ కూడా నియామకాలపై దృష్టి పెట్టింది. ఎక్కువగా సీనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుంటోంది. జూనియర్ స్థాయి వారికీ అవకాశాలు బాగానే ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్‌ఆర్) వివేక్ జైన్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం 3,600 మంది సిబ్బంది ఉన్నారని, కొత్తగా వ్యాపారావకాశాలు మరిన్ని వస్తుండటంతో.. సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో మరింత మందిని తీసుకోవాల్సి వస్తుందని వివరించారు.
జియోజిత్ బీఎన్‌పీ పారిబా తమ కస్టమర్ల వ్యాపార పరిమాణం 100% పెరిగిందని, ప్రతి ఇద్దరు కస్టమర్లలో ఒకరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ‘వ్యాపారం పెరుగుతోంది. బ్రోకర్లు బాగా ఆర్జిస్తున్నారు. ఉత్పత్తులను విక్రయించాలంటే సరైన నిపుణులు అవసరం. అందుకే దీనిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం’ అని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఎండీ సీజే జార్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర 2,000 మంది ఉద్యోగులు ఉన్నారని, మార్కెట్ల పెరుగుదలను బట్టి మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.