361 పాయింట్ల హైజంప్
ఇరాక్, గాజా, ఉక్రెయిన్‌లపై ఆందోళనలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నెమ్మదించాయి. దీంతో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. వెరసి సెన్సెక్స్ 361 పాయింట్లు ఎగసింది. ఇది గత 10 వారాల్లోనే అత్యధికంకాగా, 25,881 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం జూన్ 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. ఇక నిఫ్టీ కూడా 101 పాయింట్లు జంప్‌చేసి 7,727 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఆటో, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకున్నాయి.
ఇందుకు టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐవోసీ వంటి దిగ్గజాలు ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాలు దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ తొలుత 25,704 వద్ద లాభాలతో మొదలైంది. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో గరిష్టంగా 25,905కు చేరింది. పలు బ్లూచిప్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు, ఆయిల్ ధరలు చల్లబడటం వంటి అంశాలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఇతర విశేషాలివీ...
సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్‌సీ 5%పైగా జంప్‌చేయగా, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టీ 3-1.5% మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేవలం 3 షేర్లు నీరసించగా, భారతీ 1.7% నష్టపోయింది.
ఆయిల్ షేర్లలో గెయిల్ 6% దూసుకెళ్లగా, ఐవోసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్ 4-3% మధ్య పురోగమించాయి.
బ్యాంకింగ్ దిగ్గజాలలో బీవోబీ, యస్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యాక్సిస్ 3-1.5% మధ్య పెరిగాయి.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,555 లాభపడితే, 1,366 నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. 371 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు.
బీఎస్‌ఈ-500లో ఎస్‌ఆర్‌ఎఫ్, నవనీత్ ఎడ్యుకేషన్, జేకే సిమెంట్, ఐషర్ మోటార్స్, రామ్‌కో సిమెంట్, పీటీసీ, కేఈసీ, టిమ్‌కెన్ 13-6% మధ్య దూసుకెళ్లాయి.