industrial output data
-
Economy: ఎకానమీలో వెలుగు రేఖలు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఆర్థిక మూలాలు పటిష్టతను ప్రతిబింబిస్తూ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఆగస్టులో ఐఐపీ సూచీ 117.2 వద్ద ఉంటే, 2021 ఆగస్టులో 131.1 పాయింట్లకు ఎగసింది. వెరసి వృద్ధి 11.9 శాతమన్నమాట. ఇదిలాఉండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.35 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి తీరిదీ.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధి గణాం కాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టు 2021లో 9.7 శాతం వృద్ధిని (2020 ఇదే నెల ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ► మైనింగ్: ఉత్పత్తి 23.6 శాతం ఎగసింది. ► విద్యుత్: ఉత్పత్తి విషయంలో వృద్ధి రేటు 16%. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతమైన క్యాపిటల్ గూడ్స్ విభాగం 19.9 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలల్లో క్షీణత 14.4 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు సంబంధించిన ఈ విభాగంలో 8% వృద్ధి నమోదయితే, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలో 10.2% క్షీణత నెలకొంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి ఈ విభాగంలో 3 శాతం క్షీణత 5.2 శాతం వృద్ధిలోకి మారింది. ► ఎనిమిది మౌలిక రంగాలు: మొత్తం సూచీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో 11.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఐదు నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–ఆగస్టు) ఐదు నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 28.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో 28.6 శాతం క్షీణత నమెదయ్యింది. కోవిడ్ సవాళ్లతో ఒడిదుడుకుల బాట మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... బేస్ కూడా కారణమే! తాజా సానుకూల గణాంకాలకు బేస్ కూడా కారణం కావడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 7.1 శాతం క్షీణతను (2019 ఇదే కాలం ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ కూడా 2020 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3% క్షీనత నమోదయ్యింది. 5 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వం ఇస్తున్న నిర్దేశాలకు అనుగుణంగా 4.35 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి (2021 ఏప్రిల్‌లో 4.23 శాతం). కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతం. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో 7.27 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెలలో ధరల స్పీడ్ విషయానికి వస్తే... ఆహార ద్రవ్యోల్బణం 0.68 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 3.11 శాతం. ఒక్క కూరగాయల బాస్కెట్ 22.47 శాతం పడిపోయింది. ఆగస్టులో ఈ తగ్గుదల 11.68 శాతం. ఇంధనం, లైట్ విభాగంలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 12.95 శాతం (ఆగస్టు) 13.63 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక పటిష్టతకు రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళరత వడ్డీరేట్ల విధానానికి సీపీఐ ఈ స్థాయిలో కొనసాగడం కీలకం.. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా గడచిన ఎనిమిది ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు – ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను ఈ నెల మొదట్లో ఆర్బీఐ 5.3 శా>తానికి కుదించింది. 2021–22 రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1%, 4.5%, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2% నమోదవుతుందని భావిస్తోంది. -
మరింత క్షీణించిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనంపై ఆందోళన కొనసాగుతుండగానే, పారిశ్రామిక పురోగతి మైనస్‌లోకి జారుకోవడం మరింత భయపెడుతోంది. సెప్టెంబరు ఐఐపీ డేటా మరింత పతనమై వరుసగా రెండో నెలలో కూడా క్షీణతనునమోదు చూసింది. సెప్టెంబరు ఐఐపీ డేటా -4.3 శాతంగా ఉంది. గత నెలలో 1.1శాతంతో పోలిస్తే పారిశ్రామికోత్పత్తి సూచీ అంచనా వేసిన దానికంటే దిగువకు చేరింది. గత ఏడాది సెప్టెంబరు నెల ఐఐపీ డేటా 4.5 శాతంగా ఉంది. గణాంక విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం మైనింగ్, తయారీ, విద్యుత్ ఇలా అన్ని విభాగాల్లో ఉత్పత్తి తగ్గుదల కనిపించింది. ఇది తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడి డిమాండ్ 20.7 శాతానికి పతనమైంది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాలను సూచించే కోర్ సెక్టార్ డేటా -5.2 శాతం వద్ద 14 సంవత్సరా కనిష్టానికి చేరింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కోర్ సెక్టార్ వాటా 40 శాతం. పారిశ్రామిక వృద్ధిలో నిరంతర మందగమనం కారణంగా ఆర్బీఐ డిసెంబరులో పాలసీ రివ్యూలో మరోసారి రేటు కోత వెళ్లక తప్పదని నిపుణులు అంచనావేస్తున్నారు. -
మార్కెట్‌పై ‘బడ్జెట్’ ప్రభావం
న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్ ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే, బడ్జెట్ నిర్ణయాల నేపథ్యంలో డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్‌పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్‌పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘‘బడ్జెట్ ప్రభావం సోమవారం నాటి మార్కెట్‌పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్‌క్యాప్ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అన్నారు. మార్కెట్లకు నిరుత్సాహం... ‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్ పనితీరు అన్నది 2020 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ వారంలో వచ్చే ఫలితాలు 8వ తేదీన డెల్టాకార్ప్, గోవా కార్బన్ , 9న టీసీఎస్, 10న సీసీఎల్, 12న ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్ఎఫ్ఎల్, డీమార్ట్ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని. ‘‘బడ్జెట్లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2019–20 ఫలితాల విషయంలో ఎన్ఎస్ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఎడెల్వీజ్ ఇన్వెస్టర్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్కపూర్ తెలిపారు. తొలి వారంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై అనిశ్చితి అంచనాల నేపథ్యంలో జూలై తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 475 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు దాదాపు అయిదు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతూ వస్తున్నారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మే లో రూ. 9,031.15 కోట్లు, జూ¯Œ లో రూ. 10,385 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
361 పాయింట్ల హైజంప్
ఇరాక్, గాజా, ఉక్రెయిన్లపై ఆందోళనలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నెమ్మదించాయి. దీంతో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. వెరసి సెన్సెక్స్ 361 పాయింట్లు ఎగసింది. ఇది గత 10 వారాల్లోనే అత్యధికంకాగా, 25,881 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం జూన్ 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. ఇక నిఫ్టీ కూడా 101 పాయింట్లు జంప్‌చేసి 7,727 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఆటో, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకున్నాయి. ఇందుకు టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐవోసీ వంటి దిగ్గజాలు ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాలు దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ తొలుత 25,704 వద్ద లాభాలతో మొదలైంది. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో గరిష్టంగా 25,905కు చేరింది. పలు బ్లూచిప్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు, ఆయిల్ ధరలు చల్లబడటం వంటి అంశాలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర విశేషాలివీ... సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్సీ 5%పైగా జంప్‌చేయగా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎల్అండ్టీ 3-1.5% మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేవలం 3 షేర్లు నీరసించగా, భారతీ 1.7% నష్టపోయింది. ఆయిల్ షేర్లలో గెయిల్ 6% దూసుకెళ్లగా, ఐవోసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ 4-3% మధ్య పురోగమించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలలో బీవోబీ, యస్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యాక్సిస్ 3-1.5% మధ్య పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,555 లాభపడితే, 1,366 నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 371 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. బీఎస్ఈ-500లో ఎస్ఆర్ఎఫ్, నవనీత్ ఎడ్యుకేషన్, జేకే సిమెంట్, ఐషర్ మోటార్స్, రామ్‌కో సిమెంట్, పీటీసీ, కేఈసీ, టిమ్కెన్ 13-6% మధ్య దూసుకెళ్లాయి.