వృద్ధి తగ్గుదల తాత్కాలికమే
మధ్య కాలానికి భారత్ వృద్ధి రేటు 8 శాతానికి పైనే..
⇒ జీఎస్టీ అమలుతో ఇది సాకారం
⇒ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా
వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు అనంతర ప్రతికూల ప్రభావాలతో భారత జీడీపీ వృద్ధి రేటు క్షీణత తాత్కాలికమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. మధ్య కాలానికి 8 శాతానికిపైనే భారత్ వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకురావడం ఇందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌పై వార్షిక నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. దాని ప్రకారం... డీమోనిటైజేషన్ అనంతరం ఎదురైన ఇబ్బందుల కారణంగా జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) 6.6 శాతానికి క్షీణిస్తుంది.
గతేడాది నవంబర్ 8 తర్వాత నగదు కొరత కారణంగా వినియోగం, వ్యాపార కార్యకలాపాలు కుదేలయ్యాయి. వృద్ధిని నిలబెట్టుకోవడం సవాళ్లకు దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే. ఇది తిరిగి వెనుకటి స్థితికి వచ్చేస్తుంది. 2017–18లో 7.2 శాతానికి చేరుకుంటుంది. అనంతరం భారత జీడీపీ వృద్ధి రేటు కొన్ని సంవత్సరాలపాటు 8 శాతానికి పైనే నమోదవుతుంది. నగదు సరఫరా సులభతరం అయితే బలమైన వినియోగదారుల విశ్వాసం స్వల్ప కాలంలో వినియోగానికి కలసి వస్తుంది. పెట్టుబడుల రికవరీ అన్నది మధ్యస్థంగా ఉంటుంది. అది కూడా రంగాల వారీగా హెచ్చు, తగ్గులు ఉండొచ్చు.
భారత చర్యలకు మద్దతు
అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలకు ఐఎంఎఫ్ డైరెక్టర్లు మద్దతు పలకడం విశేషం. అయితే, నగదు చెల్లింపుల పరంగా అవాంతరాలు లేకుండా చూడాలని, తగినంత నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ కేంద్ర సర్కారును కోరింది. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ఆర్థిక పనితీరు చూపించడానికి పటిష్టమైన విధాన చర్యలు, ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉండడం, ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాలను కారణాలుగా పేర్కొంది. సరఫరా సమస్యలను తొలగించడంతోపాటు, ఉత్పత్తి పెంపు, ఉద్యోగావకాశాల కల్పన, సమగ్రాభివృద్ధికి వీలుగా సంస్కరణలు ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆటుపోట్లు, అమెరికా వడ్డీరేట్ల పెంపును వెలుపలి సవాళ్లుగాపేర్కొంది. కార్పొరేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు బలహీనపడడంపై అందోళనం వ్యక్తం చేసింది.
జీఎస్టీ బలంగానే ఉండాలి
జీఎస్టీతో ఆశించినదానికంటే అధిక ప్రయోజనాలు, నిర్మాణాత్మక సంస్కరణలు బలమైన వృద్ధి రేటుకు దారితీస్తాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీఎస్టీ కారణంగా మధ్య కాలంలో భారత వృద్ధి 8%కి పైగా నమోదవుతుందని, దేశాన్ని ఒకే మార్కెట్‌గా మార్చి వస్తు, సేవల రవాణా పరంగా సమర్థతకు దారితీస్తుందని తెలిపింది. అయితే, జీఎస్టీ రూపు రేఖలు, దాని అమలు విషయంలో అనిశ్చితిని ప్రస్తావించింది. ‘‘భారత జీడీపీలో పన్నుల వాటా 17%. ఇది వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ. బలమైన జీఎస్టీ చట్టం అమలు అన్నది మా బలమైన వృద్ధి అంచనాలకు మూలం. కనుక జీఎస్టీలో మినహాయింపులు పరిమితంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో రేట్లు ఒకే తీరులో ఉండాలి. కార్పొరేట్ పన్ను తక్కువ ఉండేలా ప్రత్యక్ష పన్నుల విధానంలో హేతుబద్ధీకరణ జరగాలి. విద్యుత్తు, రియల్టీ రంగాలను ఒకే ట్యాక్స్ రేటు పరిధిలో ఉంచాలి’’ అని సూచించింది.