
పండుగ సేల్స్ కలిసివచ్చినా అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు అంచనాలను అధిగమించలేదు.
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సేల్స్ పోటెత్తినా అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ లక్ష కోట్ల లోపే నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 5.29 శాతం తక్కువగా అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ 95,380 కోట్ల మేర నమోదయ్యాయి. అయితే సెప్టెంబర్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రూ 91,916 కోట్ల జీఎస్టీ వసూలైంది.
మరోవైపు 2018 అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ లక్ష కోట్లుగా నమోదవడం గమనార్హం. పండుగలు వచ్చిన అక్టోబర్ మాసంలోనూ జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా లేకపోవడం ఆర్థిక వ్యవస్థలో అంతా సవ్యంగా లేదనే సంకేతాలు పంపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్‌లో ఎలక్ర్టానిక్ పరికరాలు, మొబైల్స్, గృహోపకరణాల సేల్స్ ఆశాజనకంగా సాగినా, ఆటోమొబైల్ సేల్స్ ఆశించిన మేర లేకపోవడం ఆర్థిక మందగమనం ప్రభావమేనని భావిస్తున్నారు.