దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్‌లో వసూలు చేసిన ఆగస్టు స్థూల వస్తు, సేవల పన్ను జీఎస్టీ 10 శాతం పెరిగి రూ.1,62,712 కోట్లకు చేరుకుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 11 శాతం వృద్ధితో రూ. 1.65 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో మొత్తం స్థూల వసూళ్లు ఇప్పటివరకు రూ. 9.92 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరం కంటే 11 శాతం అధికం.
2023 మార్చిలో లావాదేవీలకు సంబంధించి ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో పన్ను చెల్లింపులు పుంజుకోవడంతో అత్యధిక వసూళ్లు వచ్చాయి.
దేశీయ లావాదేవీల (సర్వీస్ ఇంపోర్ట్స్ సహా) ఆదాయం సెప్టెంబరు నెలలో అంతకు ముందు సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువగా వచ్చింది. ఇక ఈనెలలో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు కాగా ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు. అలాగే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 83,623 కోట్లు, వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన మొత్తం రూ.41,145 కోట్లు. అదే విధంగా సెస్ రూపంలో వసూలైంది రూ.11,613 కోట్లు కాగా ఇందులో రూ.881 కోట్లు వస్తువుల దిగుమతిపై వసూలు చేశారు.
తెలంగాణలో రికార్డుస్థాయి వృద్ధి
ఇక రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 17 శాతం వార్షిక వృద్ధితో రూ.25,137 కోట్లు వసూలైంది. రెండవ స్థానంలో నిలిచిన కర్ణాటక రూ. 11,693 కోట్లు (20 శాతం వృద్ధి) నమోదు చేసింది. తమిళనాడు కలెక్షన్లు రూ.10,481 కోట్లు (21 శాతం వృద్ధి), గుజరాత్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.10,129 కోట్లు (12 శాతం వృద్ధి) నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రికార్డు స్థాయిలో వార్షిక వసూళ్లలో 33 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 5,226 కోట్లు వసూలు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment