సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్ట్‌లో జీఎస్టీ వసూళ్లు తగ్గడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆగస్ట్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ 86,449 కోట్లుగా నమోదయ్యాయి. జులై జీఎస్టీ వసూళ్లతో (87,422 కోట్ల రూపాయలు) పోలిస్తే ఆగస్ట్ వసూళ్లు స్వల్పంగా పడిపోవడం గమనార్హం. గడిచిన ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ మొత్తంలో ఆగస్ట్ వసూళ్లు 88 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2019 ఆగస్ట్‌లో 98,202 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో వసూలైన జీఎస్టీలో కేంద్ర జీఎస్టీ 15,906 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా 21,064 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ 42,264 కోట్లు, సెస్ కింద 7215 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడిన నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇంకా చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాలని తెలంగాణ సహా పలు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment