సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ నడుమ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని విజయం వరించినా కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీ పోరులో బీజేపీ గట్టెక్కినా సొంత రాష్ట్రంలో విపక్షం నుంచి గట్టి పోటీ ఎదురైన క్రమంలో మోదీ సర్కార్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడటం బీజేపీ శ్రేణులను ఆలోచనలో పడవేస్తోంది.
నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి మోదీ సర్కార్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు గుజరాత్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయనే అంచనాలూ వెల్లడవుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీ 150 సీట్లలో గెలుపొందాలనే టార్గెట్ నిర్ధేశించుకుంది.ఈ అంకెకు బీజేపీ చాలా దూరంగా నిలిచింది. గుజరాత్ ఫలితాల నేపథ్యంలో మోదీ తన సంస్కరణల వ్యూహన్ని పునఃసమీక్షిస్తారని భావిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు మిగిలి ఉన్న ఏడాదిన్నర వ్యవధిలో సంస్కరణల దూకుడును తగ్గించి ప్రజాకర్షక విధానాలకు తెరలేపుతారనే అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి భారీ సంస్కరణలకు దిగడం ప్రధాని మోదీకి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే అవుతుంది.
ఓట్ల వేటలో భాగంగా సంస్కరణలను పక్కనపెట్టి సంక్షేమ పథకాలు, సామాజిక కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తారనే ప్రచారం సాగుతోంది. కొత్త సంస్కరణలకు పదును పెట్టడం కన్నా ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయడం, పాలనా సంస్కరణలు చేపట్టడానికే ప్రదాని ప్రాధాన్యత ఇస్తారని బార్క్లేస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సిద్ధార్ధ సన్యాల్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment