
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా... దేశంలో తొలి స్మార్ట్ ఫ్యాన్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. జనవరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రిమోట్, మొబైల్ యాప్, వైఫైతో ఇది పనిచేస్తుంది. అలాగే అలెక్సా, గూగుల్ హోమ్ ఉపకరణాల ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. గది ఉష్ణోగ్రతను బట్టి వేగాన్ని దానంతటదే మార్చుకుంటుంది.
వచ్చే వేసవి కోసం కొత్తగా 8 రకాల ఫ్యాన్లను సిద్ధం చేశామని హావెల్స్ ఇండియా ప్రెసిడెంట్ సౌరభ్ గోయల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. సాధారణ ఫ్యాన్లను స్మార్ట్‌గా మార్చే ఓ కిట్‌ను సైతం రూపొందించామన్నారు. రూ.7,000 కోట్ల వ్యవస్థీకృత రంగ ఫ్యాన్ల మార్కెట్లో తమ కంపెనీకి 17 శాతం వాటా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–24 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు.