Havells
-
హావెల్స్ లాభం రూ.243 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా జూన్ త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. రూ.243 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. కమోడిటీల ధరలు (ముడి సరుకులు) పెరిగిపోవడంతో మార్జిన్లు గణనీయంగా ప్రభావితమైనట్టు కంపెనీ తెలిపింది. ఫలితంగా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.236 కోట్లతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.4,244 కోట్లకు చేరింది. స్విచ్గేర్ల విభాగం నుంచి ఆదాయం 37 శాతం పెరిగి రూ.517 కోట్లుగా, కేబుల్స్ విభాగం ఆదాయం 48 శాతం పెరిగి రూ.1,193 కోట్ల చొప్పున నమోదైంది. ఇక లైటింగ్ అండ్ ఫిక్సర్స్ ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.374 కోట్లుగా ఉంది. ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.839 కోట్లకు చేరింది. లయడ్స్ కన్జ్యూమర్ నుంచి ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ.1,094 కోట్లుగా నమోదైంది. -
హావెల్స్ స్మార్ట్ ఫ్యాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా... దేశంలో తొలి స్మార్ట్ ఫ్యాన్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. జనవరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రిమోట్, మొబైల్ యాప్, వైఫైతో ఇది పనిచేస్తుంది. అలాగే అలెక్సా, గూగుల్ హోమ్ ఉపకరణాల ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. గది ఉష్ణోగ్రతను బట్టి వేగాన్ని దానంతటదే మార్చుకుంటుంది. వచ్చే వేసవి కోసం కొత్తగా 8 రకాల ఫ్యాన్లను సిద్ధం చేశామని హావెల్స్ ఇండియా ప్రెసిడెంట్ సౌరభ్ గోయల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. సాధారణ ఫ్యాన్లను స్మార్ట్‌గా మార్చే ఓ కిట్‌ను సైతం రూపొందించామన్నారు. రూ.7,000 కోట్ల వ్యవస్థీకృత రంగ ఫ్యాన్ల మార్కెట్లో తమ కంపెనీకి 17 శాతం వాటా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–24 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. -
ఈ ఏడాదే హావెల్స్ కర్ణాటక ప్లాంట్!
• అస్సాంలో కూడా...; ఈ రెండు ప్లాంట్లపై రూ.300 కోట్ల పెట్టుబడి • హోవెల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గోయల్ వెల్లడి • ‘ఆక్టెట్’ 8 రెక్కల ఫ్యాన్; ‘ఫ్యూచురో’ యాప్ ఆధారిత ఫ్యాన్లు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగ వస్తువుల కంపెనీ హోవెల్స్ ఇండియా దక్షిణాదిలో తొలి ప్లాంట్‌ను ప్రారంభించనుంది. ఈ ఏడాదిలో రూ.300 కోట్ల పెట్టుబడులతో కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హవెల్స్ ప్రతినిధి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలియజేశారు. ‘‘కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ వసంత నర్సాపుర పారిశ్రామికవాడలో 62.09 ఎకరాల స్థలాన్ని హోవెల్స్‌కు కేటాయించింది. 2017 ముగింపు నాటికిది ప్రారంభమవుతుంది. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయి’’ అని ఆయన వివరించారు. ఈ ప్లాంట్‌లో కేబుళ్లు, వైర్లు, సోలార్ లైట్లు తయారు చేస్తామన్నారు. ల్యాండ్ లీజ్ ఒప్పందం మీద అస్సాంలోనూ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని, పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారాయన. ఇప్పటికే హోవెల్స్ ఇండియాకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, హరియానా రాష్ట్రాల్లో 12 తయారీ యూనిట్లున్నాయి. స్విచ్‌లు, మోటార్లు, ఫ్యాన్లు, వాటర్ హీటర్ల వంటి 17 రకాల ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తోంది. విపణిలోకి 8 రెక్కల ఫ్యాన్.. హోవెల్స్ ఇండియా దేశంలోనే తొలిసారిగా 8 రెక్కల ఫ్యాన్ ‘ఆక్టెట్’, యాప్ ఆధారిత ‘ఫ్యూచురో’, ఎంటిసర్ ఆర్ట్, అర్బేన్ ఫ్యాన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఆక్టెట్, ఫ్యూచురో ఫ్యాన్లు బీఎల్డీసీ సాంకేతిక, డస్టోఫోబిక్ మెటాలిక్ పెయింట్ ఫినిషింగ్‌తో రూపొందాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గోయెల్ ఈ సందర్భంగా చెప్పారు. వీటిని హరిద్వార్ ప్లాంట్‌లో తయారు చేశామన్నారు. వీటి ధరలు రూ.2,300 నుంచి రూ.10 వేల వరకూ ఉన్నాయి. 2003లో ఫ్యాన్ల విభాగంలోకి అడుగుపెట్టిన హోవెల్స్ 14 శాతం మార్కెట్ వాటా సాధించింది. ప్రస్తుతం దేశంలో వ్యవస్థీకృత ఫ్యాన్ మార్కెట్ రూ.65 వేల కోట్లుగా ఉండగా.. ఇందులో సీలింగ్ ఫ్యాన్ల వాటా 70 శాతం ఉంటుంది. హోవెల్స్ మొత్తం మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 10 శాతం, ఎగుమతుల వాటా 5–8% ఉంటుందని గోయెల్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 4,500 రిటైల్ షాపులు, ‘గెలాక్సీ’ పేరిట 35 సొంత స్టోర్లు ఉన్నాయి. -
మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు
ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ హావెల్స్.. అత్యాధునిక శ్రేణికి చెందిన వాటర్ హీటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉష్ణోగ్రతల స్థాయిని వెల్లడించేందుకు ఎల్ఈడీ ద్వారా రంగు మారేలా అధునాతన ఫీచర్‌ను పొందుపరిచింది. అంటే నీరు సాధారణం నుంచి గరిష్టంగా 75 డిగ్రీల వేడికి చేరినప్పుడు వాటర్ హీటర్ రంగు నీలం నుంచి జేగుర్ (అంబర్) రంగుకు మారుతుంది. అడోనియా సిరిస్ కింద డిజైన్ చేసిన ఈ హీటర్లు డిజిటల్ టెంపరేచర్ ఇండికేటర్లోనూ లభ్యమవుతాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ తెలియజేసింది. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ఉన్నాయి.