ఈ ఏడాదే హావెల్స్‌ కర్ణాటక ప్లాంట్‌! | Havells launches NextGen fans in South India | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే హావెల్స్‌ కర్ణాటక ప్లాంట్‌!

Published Wed, Feb 15 2017 1:07 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

ఈ ఏడాదే హావెల్స్‌ కర్ణాటక ప్లాంట్‌! - Sakshi

ఈ ఏడాదే హావెల్స్‌ కర్ణాటక ప్లాంట్‌!

అస్సాంలో కూడా...; ఈ రెండు ప్లాంట్లపై రూ.300 కోట్ల పెట్టుబడి
హోవెల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ వెల్లడి
‘ఆక్టెట్‌’ 8 రెక్కల ఫ్యాన్‌; ‘ఫ్యూచురో’ యాప్‌ ఆధారిత ఫ్యాన్లు విడుదల


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వినియోగ వస్తువుల కంపెనీ హోవెల్స్‌ ఇండియా దక్షిణాదిలో తొలి ప్లాంట్‌ను ప్రారంభించనుంది. ఈ ఏడాదిలో రూ.300 కోట్ల పెట్టుబడులతో కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హవెల్స్‌ ప్రతినిధి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలియజేశారు. ‘‘కర్నాటక ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ వసంత నర్సాపుర పారిశ్రామికవాడలో 62.09 ఎకరాల స్థలాన్ని హోవెల్స్‌కు కేటాయించింది. 2017 ముగింపు నాటికిది ప్రారంభమవుతుంది.

ఈ ప్లాంట్‌ ద్వారా స్థానికంగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయి’’ అని ఆయన వివరించారు. ఈ ప్లాంట్‌లో కేబుళ్లు, వైర్లు, సోలార్‌ లైట్లు తయారు చేస్తామన్నారు. ల్యాండ్‌ లీజ్‌ ఒప్పందం మీద అస్సాంలోనూ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నామని,  పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారాయన. ఇప్పటికే హోవెల్స్‌ ఇండియాకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్, హరియానా రాష్ట్రాల్లో 12 తయారీ యూనిట్లున్నాయి. స్విచ్‌లు, మోటార్లు, ఫ్యాన్లు, వాటర్‌ హీటర్ల వంటి 17 రకాల ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తోంది.

విపణిలోకి 8 రెక్కల ఫ్యాన్‌..
హోవెల్స్‌ ఇండియా దేశంలోనే తొలిసారిగా 8 రెక్కల ఫ్యాన్‌ ‘ఆక్టెట్‌’, యాప్‌ ఆధారిత ‘ఫ్యూచురో’, ఎంటిసర్‌ ఆర్ట్, అర్బేన్‌ ఫ్యాన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఆక్టెట్, ఫ్యూచురో ఫ్యాన్లు బీఎల్‌డీసీ సాంకేతిక, డస్టోఫోబిక్‌ మెటాలిక్‌ పెయింట్‌ ఫినిషింగ్‌తో రూపొందాయని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయెల్‌ ఈ సందర్భంగా చెప్పారు. వీటిని హరిద్వార్‌ ప్లాంట్‌లో తయారు చేశామన్నారు. వీటి ధరలు రూ.2,300 నుంచి రూ.10 వేల వరకూ ఉన్నాయి. 2003లో ఫ్యాన్ల విభాగంలోకి అడుగుపెట్టిన హోవెల్స్‌ 14 శాతం మార్కెట్‌ వాటా సాధించింది. ప్రస్తుతం దేశంలో వ్యవస్థీకృత ఫ్యాన్‌ మార్కెట్‌ రూ.65 వేల కోట్లుగా ఉండగా.. ఇందులో సీలింగ్‌ ఫ్యాన్ల వాటా 70 శాతం ఉంటుంది. హోవెల్స్‌ మొత్తం మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 10 శాతం, ఎగుమతుల వాటా 5–8% ఉంటుందని గోయెల్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 4,500 రిటైల్‌ షాపులు, ‘గెలాక్సీ’ పేరిట 35 సొంత స్టోర్లు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement